కాంగ్రెస్, తెదేపా హయాంలో అమలైన పథకాలకు వైకాపా సర్కార్ పేర్లు మార్చి కొత్తవిగా ప్రచారం చేసుకుంటోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అమలు చేసిన ఇందిరా జలప్రభ పథకమే నేటి వైఎస్సార్ జల కళ అని అన్నారు. ఇందులో బోరు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా వేస్తుందని... మోటారు, పంపు సెట్టు, విద్యుత్ కనెక్షన్ అన్ని రైతే భరించాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.
తమ పార్టీ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి జగనన్న విద్యా దీవెన అని..., మెయింటెనెన్స్ గ్రాంట్ పథకానికి మనబడి, నాడు- నేడు అని పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకానికి జగనన్న గోరుముద్ద అని పేర్లు మార్చుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు తులసిరెడ్డి.