బలవంతపు ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసి రెడ్డి కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమైనవని, ఈ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు కానీ వార్డు మెంబర్లకు గానీ ఏ పార్టీ గుర్తులు ఉండవని గుర్తు చేశారు. అటువంటి నేపథ్యంలో వైకాపా, తెదేపా నాయకులు తమ పార్టీ సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు గెలిచారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ పద్ధతిని మానుకోవాలని ఆయన సూచించారు. బెదిరింపులు, ప్రలోభాలు, వేలం పాటలతో అయిన ఏకగ్రీవాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. పలుచోట్ల ఏకగ్రీవాల విషయంలో అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. అవి నిజమైన ఏకగ్రీవాలు కాదని వాటిని కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. స్వచ్ఛంద ఏకగ్రీవాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని తెలిపారు.