కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ బిల్లులు రైతులకు, వినియోగదారులకు తీవ్ర నష్టం కల్గిస్తాయని కాంగ్రెస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఈ బిల్లులు తేనె పూసిన కత్తిలాంటివని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించకుండా... విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదించుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
ఈ బిల్లుల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ పైకి చెబుతున్నా... కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనం కల్గించే విధంగా ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. రైతులకు ఉపయోగపడని వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయకుండా చూడాలని కాంగ్రెస్ సహా 20 పార్టీలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయని ఆయన గుర్తు చేశారు.