తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి(thulasi reddy) ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపుల విషయాన్ని తేల్చకుండా కేంద్రం వ్యవహరించడం వల్లే తగాదాలు ఏర్పడ్డాయని ఆయన ఆక్షేపించారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ రాయలసీమకు నీరు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతుంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్ మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.
నీటి కేటాయింపులు తేల్చుకోవాలంటే తక్షణమే ముఖ్యమంత్రి, వైకాపా ఎంపీలందరూ... దిల్లీ వెళ్లి ప్రధాని కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి గురించి తెలంగాణ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాయలసీమ ఎడారి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని సూచించారు.