ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయలసీమ వైసీపీలో రోడ్డెక్కుతున్న వర్గపోరు.. కలకలం రేపుతున్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

Conflicts in YSRCP: రాయలసీమ వైసీపీలో రాజకీయ కుంపట్లు రగులుతున్నాయి. అసంతృప్తి, అసమ్మతి సెగలు ఎగసిపడుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై.. అసమ్మతి వర్గాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. పార్టీ పెద్దల ఎదుటే అసంతృప్తి స్వరాన్ని వెళ్లగక్కుతూ ఆరోపణలు సంధిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దని.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తే ఊరుకోబోమని హెచ్చరికలు జారీచేస్తున్నారు. పార్టీలో ‘పెద్దాయన’గా చలామణి అవుతున్న మంత్రి పెద్దిరెడ్డి వైపు చెప్పు విసిరేంత స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాయలసీమలోని కొన్నిచోట్ల అధికార వైసీపీ పరిస్థితిపై ఈటీవీ భారత్ కథనం.

struggle in the ysrcp
వైసీపీలో వర్గపోరు

By

Published : Jan 10, 2023, 11:34 AM IST

Updated : Jan 10, 2023, 11:50 AM IST

Conflicts in YSRCP: రాయలసీమలో.. అధికార వైసీపీ పార్టీలోని అంతర్గత విభేదాలు వీధికెక్కుతున్నాయి. అసమ్మతి, అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ కొన్నిచోట్ల అసమ్మతి నేతలు రోడ్డుకెక్కుతుంటే.. మరికొన్నిచోట్ల అవినీతిని అసమ్మతి వర్గాలు రచ్చకీడుస్తున్నాయి. టికెట్ల కోసం వర్గపోరు అంతకంతకూ ఉద్ధృతమవుతుండటం.. అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ''రాష్ట్రంలో అసమ్మతి లేని నియోజకవర్గమే లేదు. నాకూ ఉంది, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ అసమ్మతి ఉంది''..!.. ఇవి రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలివి. వైసీపీలో పెద్దాయనగా పిలిచే.. ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త అయిన ఆయనే చేసిన ఈ వ్యాఖ్యలు.. పార్టీలో కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయనేదానికి నిదర్శనం. ఇదొక్కటే కాదు.. వైసీపీకు 2019 ఎన్నికల్లో భారీగా సీట్లు ఇచ్చిన రాయలసీమలో ఇప్పుడు ఎటు చూసినా అసంతృప్తి సెగలే. అత్యధిక చోట్ల అధికార వైసీపీలో వర్గవిభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణ మాకొద్దు.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇస్తే సహించమంటూ అసమ్మతి వర్గం రోడ్డెక్కింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ సమీక్షకు వస్తే ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుంది. ఈ సందర్భంగా కొందరు పెద్దిరెడ్డి వైపు ఏకంగా చెప్పులు విసిరారు. స్థానిక నేతలు రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, నాగభూషణరెడ్డి, నారాయణరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాసులు సహా పలువురు.. ఎమ్మెల్యేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కదిరిలో లేచిన కుర్చీలు: కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, వైసీపీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డి వర్గాలు ఇటీవల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కుర్చీలు ఎత్తి కొట్టుకోబోయారు. పరస్పరం చెప్పులూ విసురుకున్నారు. ఎమ్మెల్యే తన ఒంటెత్తు పోకడలతో పార్టీలో ఎవరినీ కలుపుకుని వెళ్లడం లేదంటూ శ్రీనివాసరెడ్డి.. కదిరి ఆసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం వేదికపైనే ఆరోపణలు చేశారు.

సోదరుడిపైనే పోరాటం: ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డిపై ఆయన సోదరుడైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డే పోరాటం ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి.. నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించడమే కుటుంబంలో చిచ్చు పెట్టిందంటున్నారు. విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి కుమారుడు అవినాష్‌, మరో సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడైన నిఖిల్‌నాథ్‌రెడ్డి కారణంగానే.. తన తండ్రి 2019లో ఓడిపోయారంటూ ప్రణయ్‌ ఆరోపిస్తున్నారు. వీరి మధ్య మాటామాటా పెరిగి.. అవినాష్‌, నిఖిల్‌నాథ్‌ కలిసి.. ప్రణయ్‌పై దాడికి దిగేదాకా వెళ్లింది. ఆ సమయంలో తన పక్కనున్న అనుచరుడితో అవినాష్‌, నిఖిల్‌నాథ్‌పై.. ప్రణయ్‌ ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం కలకలం రేపింది. విశ్వేశ్వర్‌రెడ్డి వ్యవహార శైలి వల్లే ఉరవకొండలో వైసీపీ ఓడిపోయిందంటూ.. నియోజకవర్గ విస్తృతస్థాయిలో సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే.. మధుసూదన్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. అటు.. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి నియోజకవర్గంలో ప్రభావం చూపగలరన్న కారణంతో ఆయన వర్గాన్ని విశ్వేశ్వరరెడ్డి వర్గం అణచివేసే పనిలో పడింది. శివరామిరెడ్డి దగ్గరకెళ్లినా, ఆయనతో మాట్లాడినా సంక్షేమ పథకాలు అందవు, పనులూ జరగవంటూ.. విశ్వేశ్వరరెడ్డి వర్గం హుకుం జారీ చేసిందని సమాచారం.

అవినీతి చక్రవర్తి మాకొద్దు: మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామిని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది. మాజీ మంత్రి నరసేగౌడ్, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్‌ రెడ్డి, హనుమంతరాయుడు, గుడిబండలో నరసింహప్ప.. ఇలా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పలు వర్గాలు కొనసాగుతున్నాయి. ప్రతి పనికీ ఎమ్మెల్యే డబ్బు వసూలు చేస్తున్నారని.. ఎవరైనా ప్రశ్నిస్తే ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుల పేరుతో బెదిరిస్తున్నారని.. అవినీతి చక్రవర్తి అయిన ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇస్తే అంగీకరించబోమని.. అసమ్మతివర్గం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందే తెగేసి చెప్పింది. ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలు కూడా ఆయన్ను బహిరంగంగానే విమర్శించారు.

కొత్తగా బెంగళూరు దీప: హిందూపురంలో.. ప్రస్తుత సమన్వయకర్త, ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా రెండు వర్గాలు గట్టిగా పనిచేస్తున్నాయి. 2014లో పోటీ చేసి ఓడిపోయిన నవీన్‌ నిశ్చల్‌ మళ్లీ టికెట్‌ కోసం వేగంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సమయంలో నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించి, తర్వాత వెనక్కి తగ్గిన రామకృష్ణారెడ్డి.. ఇటీవల హత్యకు గురయ్యారు. ఆయన అక్క చౌళూరి మధుమతి ఇప్పుడు హిందూపురం నుంచి పోటీకి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వర్గాన్ని కూడగట్టుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించినప్పుడు ఇక్బాల్‌కు టికెట్‌ ఎలా ఖరారు చేస్తారంటూ మధుమతి వర్గీయులు కేకలేస్తూ నిరసన తెలిపారు. మరోవైపు కొత్తగా బెంగళూరుకు చెందిన వేణుగోపాలరెడ్డి భార్య దీప.. హిందూపురం ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్‌ కోసమంటూ రంగంలోకి దిగారు.

నచ్చని రోజా: ఇక మంత్రి రోజాకు నగిరి మున్సిపాలిటీలోని నాయకులతోపాటు ఆ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల నేతలతోనూ విభేదాలున్నాయి. పార్టీ పదవుల్లో ప్రాధాన్యం కల్పించలేదని విజయపురంలో వైసీపీ సీనియర్ నేత లక్ష్మీపతిరాజు వ్యతిరేకిస్తున్నారు. వడమాలపేటలో.. రోజా అన్న రాంప్రసాద్‌రెడ్డి పెత్తనం చేస్తున్నారని.. స్థానిక జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి కారాలుమిరియాలు నూరుతున్నారు. పత్తిపుత్తూరు సచివాలయం భవన ప్రారంభోత్సవం సందర్భంగా.. నిర్మాణానికి సంబంధించిన బిల్లులు తనకు రాలేదని.. ప్రారంభించడానికి వీల్లేదంటూ భవనానికి మురళీధర్‌రెడ్డి తాళాలు వేశారు. రోజా ఆ తాళాలు పగలకొట్టించి భవనాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో మురళీధర్‌ను రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిండ్రలో.. శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి, కొప్పేడు ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డితో.. రోజాకు వర్గపోరు నడుస్తోంది. తనను ఎంపీపీగా చేస్తానని హామీ ఇచ్చి మంత్రి మాట తప్పారన్నది భాస్కర్‌రెడ్డి ఆరోపణ. ఇటీవల మంత్రిని ఆహ్వానించకుండానే.. కొప్పేడులో రైతుభరోసా కేంద్రం, సచివాలయ భవనానికి.. చక్రపాణిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కేజే శాంతి, ఆమె భర్త కేజే కుమార్‌ భూమిపూజ చేశారు. పుత్తూరులో వైసీపీ రాష్ట్ర బీసీ సల్ కార్యదర్శి ఏలుమలై, నగరిలో శాంతి, ఆమె భర్త కుమార్‌.. పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. మంత్రి రోజాపై అసంతృప్తిగా ఉన్నారు.

33 మందిలో ఎంత మంది ఉన్నారో: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో 2019లో మదనపల్లెలో అనూహ్యంగా టికెట్‌ తెచ్చుకుని, ఎమ్మెల్యే అయిన నవాజ్‌ బాషా ఇప్పుడు ఒంటరయినట్లే కనిపిస్తోంది. మదనపల్లె మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఇచ్చిన టికెట్‌తో గెలిచిన 33 మంది కౌన్సిలర్లలో నలుగురైదుగురు మాత్రమే ఇప్పుడు ఆయనతో ఉంటున్నారు. ఛైర్‌పర్సన్‌ ఉన్నా మున్సిపాలిటీపై పెత్తనమంతా ఎమ్మెల్యేదే. ఛైర్‌పర్సన్, ఆమె భర్త అసంతృప్తిని బయటపెట్టకపోయినప్పటికీ ఇబ్బంది పడుతున్నారంటున్నారు. కౌన్సిల్‌ సమావేశమూ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరగాలని, కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు తెలియకుండా మాట్లాడకూడదనే పరిస్థితి ఉండడంతో.. వారు మెల్లగా పక్కకు జరుగుతున్నారు. ఇటీవల పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్‌రెడ్డిని నియోజకవర్గ పర్యవేక్షకుడిగా నియమించి చివరి నిమిషంలో వేరొకరిని తీసుకువచ్చారు.

పార్టీతో సంబంధం లేదు: తంబళ్లపల్లిలో మండలస్థాయి నాయకులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి.. ఆయన బంధువు భానుప్రకాష్‌రెడ్డి వ్యవహారశైలితో అసంతృప్తి, అసమ్మతితో రగులుతున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎందుకులే.. అనే భయంతోనే బయటపడటం.. లేదంటున్నారు. వీరిలో చాలా మందికి ఎమ్మెల్యేతో సఖ్యత లేదు. మరోవైపు పార్టీ పేరుతో సంబంధం లేకుండా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు.

ఆధిపత్య ధోరణి: మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు, కుటుంబసభ్యుల ఆధిపత్య ధోరణితో ఆలూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. చిప్పగిరి మండల జడ్పీటీసీ సభ్యుడు విరుపాక్షి రాజీనామా ఇందుకో ఉదాహరణ. విరూపాక్షి జడ్పీటీసీ అయినా చిప్పగిరిలో పెత్తనమంతా.. మండల వైసీపీ సమన్వయకర్త అయిన మంత్రి కుటుంబసభ్యుడు గుమ్మనూరు నారాయణదే. తమకు తెలియకుండా ఎవరూ విరూపాక్షికి సహకరించడానికి వీల్లేదంటూ వారు హుకుం జారీ చేయడంతో ఆయన జడ్పీటీసీ పదవికి రాజీనామా ప్రకటించారు. దీంతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలుకు వెళ్లి మరీ విరూపాక్షిని పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ మద్దతుగా ఉంటుందని భరోసానివ్వడంతో విరూపాక్షి రాజీనామాను ఉపసంహరించుకున్నారు. విరూపాక్షి మంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కావడంతో.. భవిష్యత్తులో తనకు నియోజకవర్గంలో పోటీ అవుతారేమోనని మంత్రి ఆయన్ను పక్కన పెట్టారంటున్నారు. అదే విషయంపై సజ్జల వద్ద మంత్రి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవల ఆలూరు పట్టణంలో మంత్రి గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించగా స్థానిక జడ్పీటీసీ సభ్యుడు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది.

మూడు ముక్కలాట: ఎమ్మిగనూరులో వైసీపీ టికెట్‌ మూడు ముక్కలాటలా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయోభారం రీత్యా తాను పోటీచేయలేనని, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు జగన్మోహన్‌రెడ్డికి టికెట్‌ అడుగుతున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి.. తన కుమారుడు ధరణీధర్‌రెడ్డి లేదా అన్న కుమారుడు ప్రదీప్‌రెడ్డికి ఎమ్మిగనూరు టికెట్‌ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంతోకాలంగా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న వీరశైవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రుద్రగౌడ్‌ కూడా.. ఈసారి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక.. కర్నూలు ఎంపీ టికెట్‌ లేకపోతే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు.

పంపకాలు: కర్నూలులో.. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గాలు పోటాపోటీగా ఉన్నాయి. కర్నూలు నగరపాలక సంస్థను, కార్పొరేటర్లను కూడా వీరిద్దరూ పంచుకుని రాజకీయాలు చేస్తున్నారు. నగరపాలక ఎన్నికల సమయంలో వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు వైసీపీ అధిష్ఠానం చెరి కొన్ని డివిజన్లను పంచింది. అప్పటి నుంచి రెండు వర్గాలు కొనసాగుతున్నాయి.

తగ్గేదే లే: నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య వైరం తెగట్లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా మంత్రి, వైసీపీ పెద్దలు.. చివరికి ముఖ్యమంత్రి స్థాయిలో పంచాయితీ చేసినా వీరిద్దరూ తగ్గేదే లే అంటున్నారు. ఆర్థర్‌ ఎమ్మెల్యే- పెత్తనం బైరెడ్డిది కావడంతో వీరి మధ్య వర్గ పోరు తీవ్రమైంది. కొంతకాలం భరించిన ఎమ్మెల్యే తర్వాత తిరుగుబాటు చేసి, తన వర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడంతో బైరెడ్డి వర్గం వేగాన్ని పెంచింది.

గుడ్లు నుంచి దాడుల వరకు: వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో డోన్‌ నియోజకవర్గంలో అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే టెండరు కోసం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బంధువు.. ఒక కాంట్రాక్టరుకు మద్దతుగా ప్రయత్నించారు. మరో వర్గానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మద్దతిచ్చారు. టెండర్ల దాఖలు సమయంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఇరువర్గాలు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్‌తో సర్దుబాటు కోసం తాను పిలిచి మాట్లాడిన సందర్భంలోనూ బైరెడ్డి వినకపోవడంపై బుగ్గన బాగా నొచ్చుకున్నారని సమాచారం.

భూదందాల్లో ఆధిపత్య పోరు: రాజంపేటలో భూదందాల్లో ఆధిపత్య పోరు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఆకెపాటి అమర్నాథ్‌రెడ్డి మధ్య.. రాజకీయ రణంగా మారింది. మేడా తెలుగుదేశంలో ఉన్నపుడు ఆకేపాటి.. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మేడాకు వెంటనే టికెట్ దక్కింది. ఇది కూడా వారిద్దరి మధ్య వైరానికి ఆజ్యం పోసింది. సర్దుబాటులో భాగంగానే.. ఆకెపాటికి జడ్పీ ఛైర్మన్‌ పదవి దక్కినా.. అసమ్మతి సెగ తగ్గలేదు.

యుద్ధంలో గెలిచేది ఎవరో: ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్ వర్గాల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. తనకు మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తానన్న ఎమ్మెల్యే చివర్లో మాట తప్పారని రమేష్‌ ఆరోపించారు. తెలంగాణలో తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని.. ఏకంగా ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారు. బీసీ నినాదంతో.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్‌కు కూడా ఆయన సిద్ధమవుతున్నారంటున్నారు. ఈ క్రమంలో తనను చంపుతామంటూ.. బెదిరింపు కాల్స్‌ వచ్చాయంటూ రమేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఎమ్మెల్యే.. తన బావమరిది మునిరెడ్డిని ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వైస్‌ఛైర్మన్‌ను చేసుకున్నారు. మున్సిపాలిటీలో మునిరెడ్డి పెత్తనమే నడుస్తుండటంతో.. బీసీ మహిళ అయిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌కు, మరో వైస్‌ ఛైర్మన్‌ ఖాజా మొయిద్దీన్‌కు ప్రాధాన్యమే లేకుండా పోయింది.

పరోక్ష పోరాటం: జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రామసుబ్బారెడ్డి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. ఆయన వర్గం నియోజకవర్గంలో అస్తిత్వాన్ని చాటుకుంటోంది.

సీమలో తారస్థాయికి చేరిన వైసీపీ నేతల విభేదాలు

ఇవీ చదవండి:

Last Updated : Jan 10, 2023, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details