కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట జలాశయం ముంపువాసుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారులు ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. తాళ్ల ప్రొద్దుటూరు పునరావాస కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ హరికిరణ్, జేసీ గౌతమితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు.
వ్యక్తిగత సమస్యలు, గ్రామ సమస్యలకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలి విడత కింద తాళ్లప్రొద్దుటూరు, యర్రగుడి, చామలూరు, రేగడిపల్లె, ఏటూరు, సుగుమంచిపల్లె గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. రెండో విడత కింద కొండాపురం, మూడో విడతలో మిగిలిన 14 గ్రామాలకు ప్రత్యేక స్పందన నిర్వహిస్తామని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. గండికోట జలాశయంలో ప్రస్తుతం 26 టీఎంసీల నీటి నిల్వ చేసినంత మాత్రాన ప్రజలను విస్మరించడం లేదని... పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.