కడప జిల్లా గండికోట జలాశయంలో 13 టీఎంసీలకు మించి నిల్వ చేసిన కారణంగా... తాళ్లప్రొద్దుటూరు గ్రామం ముంపు బారిన పడిందని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పరిహారం అందించడంతో పాటు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కొన్ని రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో గ్రామంలో మంచానికే పరిమితమైన వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన.
మంచానికే పరిమితం..
కాలు కోల్పోయి మంచానికే పరిమితమైన వెంకటశివారెడ్డి ఇతని పేరు వెంకటశివారెడ్డి. వయసు 57 ఏళ్లు. తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని నడివీధిలో ఇతని నివాసం. గతంలో లారీ డ్రైవరుగా పని చేసేవాడు. ఒక ప్రమాదంలో గాయమై నాలుగు నెలల కిందట ఒక కాలిని తొలగించారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు..ఆయన కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ప్రస్తుతం కళాశాలలు తెరవకపోవడంతో టీ అంగడి నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి వయసు తక్కువగా ఉందని పరిహారం అందించలేదు. శివారెడ్డికి కూడా ఇంతవరకు డబ్బులు రాలేదు.
అనారోగ్యం వేధిస్తోంది..
అనారోగ్యం వేధిస్తోందని 76 ఏళ్ల బాలిరెడ్డి ఆవేదన ఈయన పేరు బాలిరెడ్డి, వయసు 76 ఏళ్లు. తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోనే పుట్టి పెరిగాడు.. సొంతింటిలో కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు..వారిద్దరికీ పరిహారం రావాల్సి ఉంది. వ్యవసాయం, పశు పోషణతో జీవిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వేధిస్తుంటే.. మరోపక్క గ్రామాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాలని ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నాడు.
పట్టించుకున్న నాథుడే లేడు..
పట్టించుకున్న నాథుడే లేడంటున్న లక్ష్మీదేవి ఈమె పేరు బి.లక్ష్మిదేవి. వయసు 68 ఏళ్లు. కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతోంది…గ్రామం ముంపునకు గురికావడంతో ప్రస్తుతం ఎలాంటి పనుల్లేవు. వారి ఇల్లు నీట మునగడంతో స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉంటున్నారు. ఆమె ఇంతవరకు పరిహారం అందలేదు.తమ సమస్యలను పరిష్కరించాలని గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడని వాపోతోంది. న్యాయం చేయాలని కోరుతోంది.
గ్రామంతో 58 ఏళ్ల అనుబంధం..
గ్రామంతో 58 ఏళ్ల అనుబంధాన్ని చెబుతున్న లక్ష్మీదేవి లక్ష్మిదేవి వయసు 71 ఏళ్లు. ఆమెకు వివాహం జరిగిన నాటి నుంచి తాళ్లప్రొద్దుటూరులోనే నివాసం. గ్రామంతో 58 ఏళ్ల అనుబంధం ఆమెది. రాత్రికి రాత్రే వారి ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. పరిహారం అందించినా అనారోగ్య సమస్యలతో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచడంలేదని ప్రభుత్వమే ఆదుకోవాలని విన్నవిస్తోంది.
బతికుంటానో లేదో?...
బతికుంటానో.. లేదో.. అంటోన్న 92ఏళ్ల వెంకటమ్మ 92 ఏళ్ల వయసున్న ఈ బామ్మ పేరు వెంకటమ్మ.. తాళ్లప్రొద్దుటూరులోనే పుట్టి పెరిగింది.. రక్తపోటు, మధుమేహంతో బాధపడుతోంది. రెండు వారాల కిందట ఆమె ఉంటున్న మిద్దె కూలిపోవడంతో ప్రస్తుతం మరో గదిలో ఉంటోంది. వయసు పైబడి కొంచెం దూరం కూడా నడవడం కష్టంగా మారింది.ఆమెతోపాటు.. ఇంట్లో మరో ఇద్దరికి పరిహారం రావాల్సి ఉంది. డబ్బులు చేతికందేలోపు బతికుంటానో లేదోనని అంటోందీ బామ్మ. న్యాయం చేయాలని కోరుతోంది.
కార్యాలయాల చుట్టూ తిరగలేను
కార్యాలయాల చుట్టూ తిరగలేనంటున్న వెంకటలక్ష్మీ మరో బామ్మ వెంకటలక్ష్మి…వయసు 80 ఏళ్లు. కుటుంబంతో తాళ్లప్రొద్దుటూరులోని బీసీ కాలనీలో నివాసం ఉండేది. సుమారు 35 ఏళ్లుగా నివసిస్తుండడంతో గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉంది. గండికోట జలాశయం వెనుక జలాలు ఇంట్లోకి రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉంటున్నారు. ఒళ్లు నొప్పులతో ఇంటికే పరిమితమయ్యింది. ఇప్పటికీ పరిహారం అందలేదు. ఈ వయసులో పరిహారం సొమ్ముల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక లేదని బాధపడుతోంది. జీవిత చరమాంకంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదని వాపోయింది.
పత్రాలు లేవని పరిహారం ఇవ్వట్లేదు..
పత్రాలు లేవని పరిహారం ఇవ్వట్లేదని రంగమ్మ ఆవేదన రంగమ్మ కూడా 72 ఏళ్ల వృద్ధురాలు. సుమారు 12 ఏళ్ల కిందట కొత్తపల్లె నుంచి తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి వచ్చింది. గతంలో బొరుగులు అమ్ముతూ జీవనం సాగించేది. వృద్ధాప్యంతోపాటు మధు మేహం, రక్తపోటు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పని చేయలేక మానుకుంది.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే పింఛనుతో కాలం గడుపుతోంది. చదువుకోకపోవడంతో స్థానికతను తెలిపే పత్రాలు తీసుకోలేకపోయానని..ఈ కారణంగా పరిహారం ఇవ్వట్లేదని వాపోతోంది.
అర్హులందరికీ పరిహారం అందజేస్తాం
తాళ్లప్రొద్దుటూరులో అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేస్తాం. ఇప్పటికే సుమారు 2 వేల మందికి పరిహారం పంపిణీ పూర్తిచేశాం. సాంకేతిక కారణాలతో కొందరికి ఇంకా పరిహారం అందలేదు. వయోవృద్ధులు ఒంటరిగా ఉండలేరని, వారి కోసం ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేయలేదు.- శ్రీనివాసులు, బాధ్య ఆర్డీవో, జమ్మలమడుగు
ఇవీ చదవండి:
'మా సమస్యలు తీర్చాకే గండికోటలో నీరు నింపాలి'