కడప నగరంలోని కంటైన్మెంట్ జోన్లు.. కోటి రెడ్డి సర్కిల్, బీకేఎం స్ట్రీట్, హాబీబుల్లా స్ట్రీట్ , ఒకటవ గాంధీ విగ్రహం తదితర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ పర్యటించారు. కంటైన్మెంట్ జోన్లలో రోడ్లపై తిరుగుతున్న వారిని అడ్డుకున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లేకపోతే ఇళ్లలోనే ఉండాలని సూచించారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజలను కేవలం వైద్య చికిత్సకు లేదా అత్యవసర పరిస్థితులు ఉంటేనే తిరిగేందుకు అనుమతించాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. కొంతమంది బ్యాంకులకని, పోస్ట్ ఆఫీసులకని, ఏటీఎమ్ లకని తిరుగుతూ ఉండటం మంచిది కాదని అన్నారు. అత్యవసరమైతే కంటైన్మెంట్ జోన్ల పరిధిలో లేని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ఏటీఎంలను ఉపయోగించుకోవాలన్నారు.
కంటైన్మెంట్ జోన్స్ లో ముఖ్యంగా పోలీస్, వైద్య ఆరోగ్య, రెవెన్యూశాఖ లు తప్ప ఇతరులు అనవసరంగా తిరగరాదన్నారు. ఈ మూడు శాఖల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. శానిటేషన్ బాగుందని, మరింత మెరుగ్గా శానిటైజేషన్ పనులను చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు.