ఈ నెల 8న కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన - pensions
దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ నెల 8న కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఆ రోజు రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ పథకాలు ప్రకటించనున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెరిగిన పింఛన్లను సైతం అందజేయనున్నారని వెల్లడించారు.
ఈనెల 8న కడప జిల్లా జమ్మలమడుగులో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జమ్మలమడుగుకు రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరికిరణ్, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 8న ఉదయం ఇడుపులపాయ చేరుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద సీఎం నివాళులు అర్పించనున్నారు. అనంతరం జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరుకానున్నారు. వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. కర్షకులకు లబ్ధి చేకూరే విధంగా ఆ రోజు పలు కార్యక్రమాలను సీఎం ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. పెరిగిన పింఛన్ల పంపిణీ ఇక్కడ నుంచే ప్రారంభిస్తారని పేర్కొన్నారు.