CM Jagan : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద 2019 డిసెంబర్ 23న సీఎం జగన్ ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. 3వేల 591 ఎకరాల్లో 11 వేల 606 కోట్ల పెట్టుబడితో... 30 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమను మూడేళ్లలో పూర్తి చేస్తామని బహిరంగ ప్రకటన చేశారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. కానీ మూడేళ్లు దాటినా సున్నపురాళ్లపల్లె వద్ద శిలాఫలకం తప్ప... ఒక్క పనీ జరగలేదు. ఈ మూడేళ్ల కాలంలోనే లిబర్టీ సంస్థ, ఎస్సార్ స్టీల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నా... ఆ సంస్థలు పనులు చేపట్టలేదు.
తాజాగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 8వేల 800 కోట్ల రూపాయల పెట్టుబడితో జమ్మలమడుగు వద్ద పరిశ్రమ నిర్మించేందుకు అంగీకారం తెలిపింది. తొలిదశలో 3వేల 300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఉక్కు పరిశ్రమకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. గతంలో శిలాఫలకం వేసిన ప్రాంతంలోనే ఉదయం 11 గంటలకు రెండోసారి భూమిపూజ చేయనున్నారు.