ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జులై 7, 8 తేదీల్లో సీఎం జిల్లాకు వెళ్లనున్న నేపథ్యంలో ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. పులివెందుల పట్టణ శివార్లలోని బాకరాపురం వద్ద హెలిప్యాడ్, వైఎస్ఆర్ క్రీడాప్రాంగణంలో ఏర్పాటుచేసే సభ ప్రాంతాల వివరాలు తెలుసుకున్నారు.
బద్వేలులో దాదాపు రూ.150 కోట్లతో ఇరిగేషన్ పనులు, కడపలో పలు కార్యక్రమాలు, పులివెందులలో మోడల్ టౌన్ అభివృద్ధి పనులకు.. అలాగే రూ.480 కోట్లతో ఏర్పాటు కానున్న వాటర్ గ్రిడ్ పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారని కలెక్టర్ చెప్పారు. పులివెందులలో హెలిప్యాడ్ సమీపంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం, కడపలో ఉన్న వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో రూ.3.50కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫ్లెడ్ లైట్ల నిర్మాణ పనులు, బుగ్గవంక ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. కడపలో రూ.80 కోట్లతో అభివృద్ధి చేసిన రెండు రోడ్లను ప్రారంభించనున్నారని తెలిపారు. సీఎం రెండురోజుల పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అధికారికంగా రావాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.