ప్రజల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో భాగంగా.. వ్యాధి నిర్ధరణలో నాణ్యమైన ఫలితాలను ఖచ్చితంగా అందించడం కోసం.. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) లో రూ.3.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సీటీ స్కానింగ్ పరికరాన్ని ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వ్యాధి నిర్ధరణ కోసం.. కడప జీజీహెచ్లో సీటీ పరికరాన్ని, ఒంగోలు, శ్రీకాకుళం, నెల్లూరులో .. సీటీ -ఎంఆర్ఐ పరికరాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అన్నారు.