కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరొకసారి శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు బహిరంగ సభలో మాట్లాడిన సీఎం...ప్రమాణం చేసిన నెలలోపే వృద్ధాప్య పింఛన్‌ను రూ.2250 పెంచామని తెలిపారు. ఇక నుంచి వైఎస్‌ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని జగన్ అన్నారు. వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఉందన్న సీఎం జగన్...రైతుల కోసం వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ అనే పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
సున్నా వడ్డీకే రైతు రుణాలు: సీఎం జగన్
ప్రభుత్వపథకాలు నేరుగా ఇంటికే
నెల కూడా తిరగకుండా వైకాపా సర్కార్ పింఛన్ల కోసం రూ.15,675 కోట్లు ఖర్చు చేసిందన్నారు సీఎం జగన్. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తలుపు తట్టి పింఛను ఇస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 తేదీ నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను.. ఇంటికి వచ్చి వివరిస్తారన్నారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరని స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్లు ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఏడాదికి 84 వేల కోట్ల రుణాలు
రైతు రుణాల కోసం ఈ ఏడాదికి 84 వేల కోట్లు మంజూరు చేస్తామన్న సీఎం జగన్..సకాలంలో రుణాలు చెల్లించిన రైతులు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీ ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. 60 శాతం ఫీడర్లు ఉచితంగా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు అవకాశం ఉందన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ రూ.1.50 సరఫరా చేస్తున్నమని ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని సీఎం జగన్ హామీఇచ్చారు.
రైతు భరోసా...70 లక్షల రైతులకు
తుపాన్లు వచ్చినప్పుడు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీలను గత ప్రభుత్వం ఇవ్వలేదని సీఎం జగన్ చెప్పారు. ఆ బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లపై రోడ్డు పన్ను రద్దుచేశామన్న జగన్....వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. రైతుకు జరగరానిది జరిగితే రూ.7 లక్షలు చెక్కు అందిస్తామని సీఎం ప్రకటించారు. రైతులకు విపత్తు సహాయనిధి కింద రూ.2 వేల కోట్లు కేటాయించినట్టు సీఎం తెలిపారు. అన్నదాతలకు తోడుగా ఉండేందుకే వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం రూపొందించామన్నారు. వచ్చేఏడాది ఇవ్వాల్సిన పథకాన్ని 7 నెలల ముందే రైతులకు అందుబాటులోకి తెచ్చారమన్నారు. రైతు భరోసా కింద 70 లక్షలమంది రైతులకు రూ.8,750 కోట్లు అందిస్తామన్నారు.అక్టోబర్ 15 రైతు భరోసా అందిస్తామని ప్రకటించారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి రాయలసీమ, ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తామని సీఎం చెప్పారు.
సున్నా వడ్డీకే రైతు రుణాలు: సీఎం జగన్ కడప స్టీల్ ప్లాంట్
కడప స్టీల్ ప్లాంట్‌కు డిసెంబరు 26న శంకుస్థాపన చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ప్లాంట్‌ను మూడేళ్లలో పూర్తి చేసి అందిస్తామన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తయితే 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.
కుందూ నదిపై రాజోలు, జలదరాశి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్టులకు డిసెంబరు 26న శంకుస్థాపన చేస్తామన్నారు. గండికోట జలాశయంలో 20 టీఎంసీలను నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గండికోట నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుచేస్తామని హమీఇచ్చారు.
ఇదీ చదవండి : భారత జట్టే ప్రపంచకప్ విజేత : షోయబ్ అక్తర్