CM Jagan Kadapa Tour: కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్.. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పులివెందుల పారిశ్రామికవాడలో రూ.110 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆదిత్య బిర్లా టెక్స్‌టైల్స్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. పరిశ్రమ ద్వారా తొలిదశలో 2 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని సీఎం అన్నారు. పరిశ్రమ పూర్తయితే అర్హులకు మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.
"పులివెందులలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మార్కెట్‌యార్డు రూపురేఖలు మారిపోయాయి. చీనీ రైతుల కోసం 6 వేల టన్నులు నిల్వ చేసేలా షెడ్డు ఏర్పాటు చేశాం. పెద్దముడియం, కాశీనాయన పోలీస్‌స్టేషన్లు ప్రారంభిస్తున్నాం. పులివెందులలో ఆక్వా హబ్‌ను ప్రారంభిస్తున్నాం. మత్స్యసంపద ఇక్కడికి అందుబాటులోకి తెస్తున్నాం. వందకు పైగా చేపలు, రొయ్యల దుకాణాలు పులివెందులలో ఉన్నాయి. రాష్ట్రంలో 70 ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేలకు పైగా చేపలు, రొయ్యల దుకాణాలున్నాయి. చేపలు, రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలకు చర్యలు తీసుకుంటున్నాం. పులివెందులలో రూ.500 కోట్లతో వైఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వైద్యకళాశాల అందుబాటులోకి వస్తుంది. 2022 డిసెంబర్ నాటికి కొత్త బస్ డిపో, బస్టాండ్ నిర్మాణం చేపడతాం." - జగన్, ముఖ్యమంత్రి
వైఎస్ ఘాట్ వద్ద నివాళులు..
అంతకు ముందు సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌ని సందర్శించి తన తండ్రికి నివాళులర్పించారు. సీఎం వెంట ఎంపీ అవినాశ్ రెడ్డి, మంత్రులు సురేష్, అంజాద్ బాషా సహా పలువురు పార్టీ నేతలు ఉన్నారు.