ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

cm jagan tour in kadapa : 'అన్ని విధాలా ఆదుకుంటాం...వరద బాధితులకు సీఎం భరోసా'

cm jagan tour in kadapa district : ఊహించని వరదతో కోతకు గురైన అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసి నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. పరివాహక గ్రామాల్లో రక్షణ గోడలు నిర్మిస్తామని వెల్లడించారు. వరదల్లో ఆవాసాలు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మిస్తామని కడప జిల్లా పర్యటనలో సీఎం హామీ ఇచ్చారు.

cm jagan tour at flood affected area at kadapa
cm jagan tour at flood affected area at kadapa

By

Published : Dec 2, 2021, 1:49 PM IST

Updated : Dec 3, 2021, 3:48 AM IST

cm jagan tour in kadapa district: కడప జిల్లాలో ఇటీవల వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించారు. తాడేపల్లి నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా రాజంపేట మండలం పులపుత్తూరు వెళ్లారు. వరద నష్టం, సహాయచర్యలపై గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించారు . కట్టుబట్టలతో మిగిలామంటూ వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులు.. సీఎంకు మొర పెట్టుకున్నారు. వారికి కొత్త ఇళ్లు కట్టిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వరదల కారణంగా డ్వాక్రా డబ్బు చెల్లించలేమని మహిళలు విన్నవించగా ఏడాదిపాటు మారటోరియం విధించేలా బ్యాంకులను కోరతామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

5 సెంట్ల స్థలాన్నిఅందిస్తాం...

గురువారం మధ్యాహ్నం 12.10 నుంచి 3.10 గంటల వరకు మూడు గంటలపాటు పులపుత్తూరు గ్రామంలోనే గడిపారు. తర్వాత ఎగువ, దిగువ మందపల్లి గ్రామాల్లో సీఎం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ‘కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తి.. పింఛ, అన్నమయ్య జలాశయాల మట్టికట్టలు తెగిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి పంపించవచ్చు. 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఒత్తిడిని తట్టుకోలేక కట్ట దెబ్బతింది. ఆ నీరంతా చెయ్యేరు నది పరీవాహక గ్రామాల్లోకి చేరడంతో భారీ నష్టం వాటిల్లింది. బాధితులకు ఇప్పటికే 99 శాతం సాయం చేశాం. సాయం అందనివారు ఉంటే మీ వివరాలను గ్రామ సచివాలయాల్లో అందజేస్తే, విచారించి మేలు చేస్తాం. పింఛ, అన్నమయ్య జలాశయాల పునరుద్ధరణ పనులను కొత్త ఆకృతి ప్రకారం చేపడతాం. భవిష్యత్తులో ఎంతటి ప్రవాహం వచ్చినా గ్రామాల్లోకి వరద రాకుండా చర్యలు చేపడతామని అన్నారు. నదికి ఇరువైపులా నందలూరు వంతెన వరకు రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి... ఇళ్లు దెబ్బతిన్న వారికి రానున్న రోజుల్లో ప్రమాదం లేకుండా ఎత్తయిన ప్రదేశంలో పక్కాగృహాలు కట్టించడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేస్తామని వెల్లడించారు.

ఇళ్లు నిర్మించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. పంటలు నష్టపోయిన వారందరికీ పరిహారం ఇస్తాం. పొలాల్లో ఇసుక మేటలను తొలగించడానికి హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తాం. స్వయం సహాయ సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలకు కంతులు చెల్లించలేమని నాతో చెప్పారు. ఉన్నతస్థాయిలో చర్చించి వారికి మంచి చేస్తాం. నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తాం. పనులు లేనివారికి ఉపాధిహామీ పథకంలో పనులు కల్పిస్తాం. వాహనాలు కొట్టుకుపోయిన వారికీ న్యాయం చేస్తాం’

- జగన్మోహన్​రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

వరద బాధితులకు సీఎం జగన్​ భరోసా

చిత్తూరు జిల్లాలో భారీ నష్టం...

వరదల వల్ల చిత్తూరు జిల్లాకు ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నేరుగా రేణిగుంట మండలం వెదళ్ల్లచెరువు ప్రాంతంలోని యానాది కాలనీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. వరదలతో తాము ఎదుర్కొన్న కష్టాలను పలువురు ఆయనకు చెప్పారు. అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు బాధితులు.. కొందరు అధికారులు తమ సమస్యలు పరిష్కరించట్లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆ కాలనీలో ఇంటింటికీ తిరిగి దెబ్బతిన్న గృహాలు పరిశీలించారు. బాధితులకు ఇళ్ల పట్టాలతోపాటు నిత్యావసర సరకులు అందజేశారు.

అక్కడి నుంచి ఏర్పేడు మండలం పాపానాయుడుపేట- గుడిమల్లం వెళ్లే మార్గంలో స్వర్ణముఖి నదిపై వంతెన కూలిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. శుక్రవారం తిరుపతిలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి, నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు.

ఇదీ చదవండి:

RAIN NEWS IN ANDHRA PRADESH: ఎడతెరిపి లేని వాన.. పంటలకు అపార నష్టం

NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

Last Updated : Dec 3, 2021, 3:48 AM IST

ABOUT THE AUTHOR

...view details