కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీపై సమీక్ష నిర్వహించిన ఆయన జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, గాలేరు-నగరి నుంచి హంద్రీనివా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను వేగవంతం చేయాలన్నారు.
గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఇప్పటికే శిలాఫలకాలు ఆవిష్కరించిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వేంపల్లి భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.92 కోట్లు వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. పులివెందుల వైద్య కళాశాల నిర్మాణానికి ఈ వారంలోనే భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలన్నారు. ఈ రెండేళ్లలో జిల్లా పర్యటనలో భాగంగా శంకుస్థాపనలు చేసిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు. జమ్మలమడుగు స్టీల్‌ప్లాంట్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.