పరిశ్రమల స్థాపనతో సీమ రూపురేఖలు మారిపోతాయి ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా కొప్పర్తి పారిశ్రామికవాడలోని వైఎస్‌ఆర్ మెగా ఇండస్ట్రియల్ హబ్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను సీఎం ప్రారంభించారు. డిక్సన్ పరిశ్రమకు కేటాయించిన 4 షెడ్లతో పాటు.. మరో 18 చిన్న పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు. పరిశ్రమల స్థాపనతో సీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు.
'ఇప్పటికే రాష్ట్రంలో డిక్సన్ సంస్థ ఏర్పాటైంది. ఏప్రిల్ నాటికి పరిశ్రమలో 1,800 మందికి ఉపాధి లభిస్తుంది. ఆరు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. వచ్చే 9 నెలల్లో కొత్త సంస్థల్లో 7,500 మందికి ఉపాధి లభిస్తుంది. కొప్పర్తిలో రాబోయే రోజుల్లో 75 వేల మంది ఉపాధి పొందుతారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు వీవీడీఎన్ సంసిద్ధత. ఇక్కడి హబ్‌లో మరో 18 ఎంఎస్‌ఎంఈలకు శంకుస్థాపన జరిగింది. ఎంఎస్‌ఎంఈల్లో 1,200 మంది యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులు ఉన్నాయి. రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు కొత్త సంస్థలు ఉపయుక్తం. పారిశ్రామికవేత్తలందరికీ భరోసా ఇస్తున్నా. నా సొంత జిల్లా కావున పారిశ్రామికవేత్తలు ధైర్యంగా రావాలి. ' -జగన్, ముఖ్యమంత్రి
అంతకు ముందు గోపవరంలో కాశీనాయన పోలీస్‌స్టేషన్, బి.కోడూరు పశువుల ఆసుపత్రి, బద్వేలు ఆర్డీవో కార్యాలయం పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 1,600 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న మేజర్స్ సెంచరీ ప్రాజెక్టు ఫ్లైవుడ్ పరిశ్రమకూ శ్రీకారం చుట్టారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొత్త తాగునీటి సరఫరా పథకం, మురుగునీటి పారుదల వ్యవస్థ, పెన్నా నదిపై హైలెవల్ వంతెన, ఆసుపత్రి అభివద్ధి, నూతన బస్టాండ్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు 515 కోట్లతో సీఎం శంకుస్థాపనలు చేశారు. కోర్టుల్లో కేసులు పరిష్కారం చేసి త్వరలోనే ప్రొద్దుటూరు, పులివెందుల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తామని చెప్పారు. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
'ప్రజల ఆశీస్సులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా. ప్రొద్దుటూరు లబ్ధిదారుల ఖాతాలకు రూ.326 కోట్లు బదిలీ చేశాం. ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలకు రూ.200 కోట్లు మంజూరు చేశాం. 10,220 మందికి ఇంటిస్థలాలు ఇచ్చాం. కోర్టు కేసుల ఇబ్బందులు అధిగమించి నిర్మాణ పనులు చేపట్టాం. ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. మైలవరం జలాశయం నుంచి 170 కి.మీ. పైపులైను నిర్మాణం చేపట్టాం. డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నాం. అందుకుగానూ రూ.163 కోట్లు కేటాయించాం. 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైపు లైను ఏర్పాటు చేస్తున్నాం. ప్రొద్దుటూరులో సీవరేజ్ ప్లాంట్, ఆర్టీపీపీ రోడ్డుపై వంతెన నిర్మిస్తాం. ప్రొద్దుటూరులో రూ.51 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నాం. రూ.24 కోట్లతో డిగ్రీ కళాశాల రూపురేఖలు మారుస్తున్నాం. రూ.63 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల భవనాలు నిర్మిస్తాం. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన వారికి అండగా ఉంటా.' - జగన్, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి
TDP PRESIDENT CHANDRABABU NAIDU : 'రుణభారంలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలోకి నెట్టారు'