ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM kadapa tour: కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన.. పార్టీ నేతలకు క్లాస్ - లాప్‌టాప్‌ తయారీ

cm kadapa tour: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన ముగిసింది. చివరి రోజు కడప నగరంలో 871 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్​లో ఆల్ డిక్సన్ పరిశ్రమను సీఎం ప్రారంభించారు. కడపకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులతో గంటపాటు సమావేశమైన సీఎం జగన్.. తాజా పరిణామాలపై క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 10, 2023, 6:04 PM IST

cm kadapa tour: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల కడప జిల్లా పర్యటన ఇవాళ ముగిసింది. ఉదయం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి కడప ఆర్ట్స్ కళాశాల చేరుకున్నారు.ఆర్ట్స్ కళాశాలలోని హెలిప్యాడ్ వద్ద స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో గంటసేపు సమావేశమయ్యారు. ఇటీవల కడపకు చెందిన వైసీపీ నేతలపై భూకబ్జాలు, అవినీతి, ఆరోపణలు, హత్యలు జరిగిన సంఘటనలు వెలుగు చూడడంతో ముఖ్యమంత్రి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతర్గత విషయాలపై ఆరా... కడపలో పార్టీ పరంగా ఏం జరుగుతుందని పార్టీ నేతలతో సీఎం చర్చించినట్లు తెలిసింది. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరూ చేయకూడదని ఆదేశించినట్లు సమాచారం. అనంతరం కడప నగరంలో 5.61 కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ మార్గ్ రోడ్డును, 1.37 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన రాజీవ్ పార్క్ పనులను సీఎం ప్రారంభించారు. తదనంతరం బుగ్గవంకపై రూ. 20 కోట్లతో చేపట్టే ఫుట్ ఓవర్ బ్రిడ్జినిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ.69.20 కోట్ల రూపాయలతో చేపట్టే మేజర్ స్టార్మ్ వాటర్ డ్రైన్ సిస్టం, రూ.31.17 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నిర్మాణం, రూ.15 కోట్లతో అమృత్ పథకం క్రింద పుట్లంపల్లి చెరువు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం శిలాఫలకాలను ఆవిష్కరించారు. రూ.106 కోట్లతో కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ హౌసింగ్ కాలనీలో నీటి సరఫరా పనులకు, రూ.572 కోట్లతో అమృత్ పథకం కింద బ్రహ్మం సాగర్ నుంచి కడప కార్పొరేషన్ కు మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.50.22 కోట్లతో మురుగు నీరు, సెప్టెడ్ మేనేజ్​మెంట్ పలు అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. మొత్తం 871 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

కార్మికులతో మాటా మంతి.. ముఖ్యమంత్రి జగన్ కడప నుంచి హెలికాప్టర్లో సీకే దిన్నె మండలం కొప్పర్తి పారిశ్రామిక వాడకు వెళ్లారు. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ ట్రస్టర్లో ఏర్పాటు చేసిన ఆల్ డిక్సన్ యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించి సర్వైలెన్స్‌ కెమెరాలు, డిజిటల్‌ రికార్డర్, లాప్‌టాప్‌ తయారీ కేంద్రాలను సీఎం పరిశీలించారు. డిక్సన్ పరిశ్రమలో యూనిట్ల తయారీ ఏవిధంగా ఉంది.. ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా తయారు చేస్తున్నారని దానిపై పరిశ్రమ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పని చేస్తున్న కొందరు కార్మికులతో సీఎం జగన్ పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈఎంసీలో మరికొన్ని పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన, శిలాఫలకాలు ఆవిష్కరించారు. కొన్ని ముఖ్య పరిశ్రమలకు సంబంధించి సీఎం జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఒకరికొకరు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. సీఎం జగన్ మూడు రోజుల పర్యటన ముగించుకుని కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. సీఎం జగన్​ను మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు వీడ్కోలు పలికారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details