కడప జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. కడప జిల్లా రాజంపేట మండలం పెద్దకారంపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జిల్లాలోని గండికోట ప్రాజెక్టులో గతంలో 11 టీఎంసీలకు మించి నీరు నిల్వ ఉండేది కాదని.. ఇప్పుడు 26 టీఎంసీలకు పెంచిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు.
రాజంపేట అన్నమయ్య జలాశయం సుండుపల్లిలోని ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు. వీటికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. అది సీఎం చేసినట్లేనని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయిన దక్కాలంటే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.