ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందుకే పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవట్లేదు: జగన్ - అనంతపురం జిల్లా రాయదుర్గం

పొరుగు రాష్ట్రంతో విభేదాలు వద్దని, అక్కడా, ఇక్కడా ప్రజలు బాగుండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. అందుకే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని న్యాయంగా వాడుకుంటే తప్పేంటని తెలంగాణను ఉద్దేశించి జగన్ ప్రశ్నించారు.

cm speech
సీఎం

By

Published : Jul 9, 2021, 6:03 AM IST

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని న్యాయంగా వాడుకుంటే తప్పేంటని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 800 అడుగుల్లోపు ఉన్నప్పుడే మీకు కేటాయించిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు.. అదే 800 అడుగుల్లోపు ఉంటే రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కేటాయించిన నీటిని మేం వాడుకుంటే తప్పేంటని తెలంగాణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంతో విభేదాలు వద్దని, అక్కడా, ఇక్కడా ప్రజలు బాగుండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలని జగన్‌ పేర్కొన్నారు. అందుకే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతు దినోత్సవం సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలిసిన లెక్కలే. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు జరిగాయి. రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీల చొప్పున జరిగిన నీటి కేటాయింపులపై 2015 జూన్‌ 19న రెండు రాష్ట్రాలు, కేంద్రం సంతకాలు చేశాయి. శ్రీశైలంలో 881 అడుగుల పైకి నీరు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్‌ డిశ్ఛార్జి నీరు కిందికి రాదు. గత 20 ఏళ్లలో కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే 881 అడుగుల పైకి నీరున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని పాలమూరు- రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి నీటిని వాడుకుంటున్నారు. మరోవైపు 796 అడుగుల్లోపు తెలంగాణ విద్యుత్తుత్పత్తి చేస్తోంది. అలాంటప్పుడు అదే 800 అడుగుల్లోపులో రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కేటాయించిన నీటిని మేం వాడుకుంటే తప్పేంటి’ అని సీఎం అన్నారు.

మాది రైతు పక్షపాత ప్రభుత్వం
రైతు దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తొలుత రాయదుర్గం మండలం 74-ఉడేగోళం గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. రాయదుర్గం మార్కెట్‌ యార్డులో వైఎస్‌ఆర్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను, విద్యార్థి పాఠశాల మైదానంలో రైతు భరోసా రథాలను ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ బతికి ఉన్నంతకాలం రైతు కోసం పరితపించిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, గడిచిన రెండేళ్లలో ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఏర్పాటు చేశామన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి, అవసరమైన సలహాలు, సూచనలు చేయడానికి ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్‌ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.

అభివృద్ధి అంటే ఇదే..
‘నేనంటే గిట్టని కొంతమంది రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లలో గ్రామాల రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను బాగు చేశాం. రైతుభరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రతి గ్రామంలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం’ అని సీఎం చెప్పారు. ఇదంతా అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. అమూల్‌ను రాష్ట్రం మొత్తం విస్తరింపజేసి భవిష్యత్తులో పాల విప్లవం తీసుకొస్తామని ప్రకటించారు.

చంద్రబాబు అప్పుడేం చేశారు?
కృష్ణా జలాల అంశంపై తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాతున్నారని జగన్‌ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు దీనిపై మొదట్లో మౌనంగా ఉండి ఇటీవలే మాట్లాడటం మొదలుపెట్టారన్నారు. ‘చంద్రబాబుకు ఈ విషయంపై ఘాటుగా చెప్పదలచుకున్నా. గతంలో మీరు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడూ తెలంగాణకు కేసీఆరే సీఎం. ఆయన పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కడుతుంటే మీరేం చేస్తున్నారు’ అని సీఎం ప్రశ్నించారు. నీటి విషయంలో జరుగుతున్న రాజకీయాలు చూడలేకే ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నానన్నారు. అందరికీ ఆస్తులకు వారసులుంటారు.. కానీ జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డ్డి ఆశయాలకు వారసుడని వ్యవసాయ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, అప్పలరాజు, గుమ్మనూరు జయరాం, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని జయించాలని మీరే సీఎంను చేశారు


పులివెందులలో రూ.630 కోట్లతో చేపట్టిన 25 పనులతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం బహిరంగ సభలో మాట్లాడారు. ‘పులివెందుల అభివృద్ధిని మేం చూసుకుంటాం.. రాష్ట్రాన్ని జయించాలని మీరు నన్ను ముఖ్యమంత్రిని చేశారు. నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. పులివెందులను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం’ అని జగన్‌ అన్నారు. గురువారం రాత్రి ఇడుపులపాయలోని అతిథిగృహంలో సీఎం బస చేశారు.

నాన్నా.. ప్రతిక్షణం నీ అడుగుజాడనే స్మరిస్తున్నా

రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా గుర్తు చేసుకున్నారు. ‘చెదరని చిరునవ్వే నువ్వు పంచిన ఆయుధం. పోరాడే గుణమే నువ్విచ్చిన బలం. మాట తప్పని నైజమే నువ్వు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిన్ను చూస్తున్నా. పాలనలో ప్రతిక్షణం నీ అడుగు జాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా’ అని ట్వీట్‌ చేశారు. - సీఎం జగన్‌ ట్వీట్‌

విడివిడిగా నివాళులు ఉదయం షర్మిల, సాయంత్రం జగన్‌

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణించిన తర్వాత ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద ఏటా నిర్వహించే ఆయన జయంతి వేడుకల్లో కుటుంబసభ్యులంతా కలిసి పాల్గొనేవారు. అయితే గురువారం మాత్రం వేర్వేరుగా వచ్చి నివాళులర్పించారు. ఉదయం 8 గంటల సమయంలో వైఎస్‌ విజయమ్మ, షర్మిల, వై.ఎస్‌.వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత కలిసివచ్చి రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. గతంలో షర్మిల ఇడుపులపాయకు వస్తే వైకాపా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చి కలిసేవారు. ఈసారి చాలామంది రాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ అనంతపురంలో నిర్వహించే రైతు దినోత్సవంలో పాల్గొనేందుకు ఉదయం 10.25 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. 10.35కు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయదుర్గం వెళ్లారు. సీఎం కడప విమానాశ్రయం నుంచి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఆయన తల్లి, చెల్లెలు అక్కడికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు. షర్మిల ఇడుపులపాయ నుంచి వెళ్లిన తర్వాత జగన్‌ సతీమణి భారతి ఒంటరిగా వైఎస్‌ ఘాట్‌ వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. సీఎం జగన్‌ అనంతపురం, పులివెందులలో సమావేశాలను ముగించుకుని తన సతీమణి భారతితో కలిసి గురువారం సాయంత్రం ఇడుపులపాయకు వచ్చి నివాళులర్పించారు. వారి వెంట కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైకాపా నేతలు ఉన్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

ABOUT THE AUTHOR

...view details