CM Jagan Birthday Celebrations in AP: సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల నిర్వహణపై పలుచోట్ల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు విద్యార్థులతో నినాదాలు చేయిస్తూ ర్యాలీలు నిర్వహించాలని సూచిస్తున్నారు. దీంతో అధికారుల తీరు విద్యాసంస్థలను రాజకీయ వేదికలుగా మార్చేలా ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు.
సీఎం జగన్ పుట్టినరోజు..9 ప్యాకేజీలు ప్రకటించిన ఏపీఎస్‌ఎఫ్‌ఎల్
విద్యాశాఖ అధికారి తీరుపై విమర్శలు:
వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవరెడ్డి తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం సీఎం జగన్ జన్మదిన వేడుకలునిర్వహించాలని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు వాట్సప్ సందేశం ద్వారా డీఈవో ఆదేశించారు.
AP CM Jagan Birthday Celebrations in Schools: దీంతో ప్రొద్దుటూరులో "హ్యాపీ బర్త్‌డే జగన్ మామయ్య", "మాకు జగన్ మామయ్యే కావాలి" అనే నినాదాలు, బ్యానర్లతో విద్యార్థులతో ర్యాలీలు చేయించాలని అధికారులు సూచించారు. విద్యాశాఖ అధికారుల సందేశాలతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. అధికారుల ఆదేశాలు పాఠశాలలను రాజకీయ వేదికలుగా మార్చెలా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
ఫ్లెక్సీ ఏర్పాటుతో ఉపకులపతి మరోసారి అభాసుపాలు:
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి(Vice Chancellor) రాజశేఖర్ ముఖ్యమంత్రి జగన్పై మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా విశ్వవిద్యాలయం బయట భారీ ఫ్లెక్సీ(CM Jagan Birthday Flexis) ఏర్పాటు చేశారు. రాజశేఖర్ ఉపకులపతి అయిన తర్వాత విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్సీపీ అనుబంధ కార్యాలయంగా మార్చారని ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.