కడప జిల్లా యర్రగుంట్ల వద్దనున్న జువారి సిమెంటు కర్మాగారాన్ని మూసివేయాలని... రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాలుష్య నియంత్రణ మండలి సూచించిన మేరకు జువారి సిమెంటు పరిశ్రమ నియమ నిబంధనలు పాటించలేదని అందులో పేర్కొంది. పర్యావరణానికి హాని కల్గించే విధంగా కాలుష్యం వెదజల్లడం, కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టక పోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించిన కారణంగా.. పరిశ్రమను మూసివేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చామని ఆ ప్రకటనలో వివరించింది.
కాలుష్య నియంత్రణ మండలికి వచ్చిన ఫిర్యాదుల మేరకు... మార్చిలో మండలి కమిటీ సభ్యులు జువారి సిమెంటు కర్మాగారాన్ని పరిశీలించారు. నిబంధనలు పాటించడం లేదని నివేదిక పొందుపర్చారు. కాలుష్యనివారణకు అనుసరించాల్సిన పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం వంటివి గమనించారు. పర్యావరణ అనుమతులు పొందే సమయంలో నిబంధనలు పాటించలేదని గుర్తించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తీవ్రంగా పరిగణించి... జువారి సిమెంటు కర్మాగారాన్ని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ కర్మాగారానికి కరెంటు సరఫరా నిలిపివేయాలని విద్యుత్ శాఖను ఆదేశించింది.