ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YSRCP Clashes: ఫ్లెక్సీల వివాదం.. ప్రొద్దుటూరు వైకాపాలో మరోసారి భగ్గుమన్న విభేదాలు - Clashes between YSCRCP Activist

MLA Vs MLC: కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైకాపా నేతల మధ్య అంతర్గత పోరు మరోసారి రచ్చకెక్కింది. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రాచమల్లు ఫోటో లేదని ఆయన వర్గం అడ్డుకోగా.. ప్రైవేటు కార్యక్రమంలో ప్రోటోకాల్‌ ఏంటని ఎమ్మెల్సీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వివాదం కాస్తా చిలికి చిలికి పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది.

Clashes between MLAs and MLCs Activist
Clashes between MLAs and MLCs Activist

By

Published : Jan 14, 2022, 2:03 PM IST

Updated : Jan 15, 2022, 7:12 AM IST

ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ‌ర్గీయుల మ‌ధ్య ఘర్షణ

Prodduturu political heat: సీఎం సొంత జిల్లా కడప వైకాపాలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొద్దుటూరులో కొన్నేళ్లుగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ మధ్య నెలకొన్న వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వైకాపా ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ జన్మదినం ఈ నెల 16న కాగా ఆ సందర్భంగా ఆయన అనుచరులు శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో పలు చోట్ల ప్లెక్సీలు కట్టారు. వాటిలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఫోటో లేదు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీరాములపేటలోని పదో వార్డు కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మీదేవి ఇంటి సమీపంలో ప్లెక్సీలు కడుతుండగా ఎమ్మెల్యే ఫోటో లేని ప్లెక్సీ ఇక్కడ కట్టొద్దంటూ మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి తనతో వాగ్వాదానికి దిగాడని ఎమ్మెల్సీ అనుచరుడు రఘునాథ్‌రెడ్డి చెప్పారు. అదే సమయంలో కౌన్సిలర్‌ లక్ష్మీదేవి, ఆమె భర్త సహా మరికొందరు తనపై దాడి చేశారంటూ రఘునాథ్‌రెడ్డి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిగా ఎమ్మెల్యే వర్గీయులు కావాలనే ఎమ్మెల్సీ అనుచరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైకాపా కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి ఆరోపించారు.

తామెవరిపైనా దాడి చేయలేదని ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీ కట్టొద్దని మాత్రమే చెప్పామని కౌన్సిలర్‌ లక్ష్మీదేవి చెప్పారు. ఘటన సమయంలోఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ వచ్చి తనను తుపాకీతో చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదం జరిగినప్పుడు తాను అక్కడ లేనన్న ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ తుపాకీతో బెదిరించారననే ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరపాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గతేడాది జూన్‌ 25న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌కు ఇంటర్నెట్‌ ఫోన్‌కాల్‌ చేసి చంపుతామని బెదిరించారు. ఊరు వదలి వెళ్లకపోతే నందం సుబ్బయ్యకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. దానిపై అప్పట్లో వైకాపా అధిష్ఠానానికి, ప్రొద్దుటూరు డీఎస్పీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు ఆ కేసు తేలలేదు. ఇదంతా ఎమ్మెల్యే అనుచరులే చేశారని ప్రతిపక్షాలు ఆరోపించినా రాచమల్లు మాత్రం వాటిని కొట్టిపారేశారు. మరోవైపు తాజా వివాదంతో ఎమ్మెల్సీతో పాటు అన్ని రకాల ఫ్లెక్సీలను మున్సిపల్‌ అధికారులు తొలగిస్తున్నారు.

ఇదీ చదవండి..

Last Updated : Jan 15, 2022, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details