ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీనివాస్ ఇంట్లో సీఐడీ అధికారులు భారీగాబంగారం, నగదు పట్టుకున్నారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగాయి. ఆప్కోలో అక్రమాలపై విచారణ చేస్తున్న సీబీ సీఐడీ... ఈ సోదాలు చేసింది.
ఈ తనిఖీల్లో గుజ్జల శ్రీనివాస్ ఇంట్లో కోటి రూపాయల నగదు, 3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు గత కొంతకాలంగా విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు.. శుక్రవారం కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. ఆప్కోలో జరిగిన అవినీతిపై మంగళగిరి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
తిరుపతికి చెందిన సీఐడీ అధికారుల బృందం... గుజ్జల శ్రీనివాస్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. తమ విచారణ నివేదికను కోర్టుకు సమర్పిస్తామని సీఐడీ డీఎస్పీ తెలిపారు.