ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆప్కో' అవినీతిపై సీఐడీ విచారణ వేగవంతం - ఆప్కో అవినీతిపై సీఐడీ విచారణ వార్తలు

గత ప్రభుత్వ హయాంలో ఆప్కో - చేనేత రంగంలో అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్న సీఐడీ.. వేగం పెంచింది. 2 రోజుల నుంచి సీఐడీ అధికారులు కడప జిల్లాలో ఉంటూ పలు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

CID expedited investigation into aapco corruption
'ఆప్కో' అవినీతిపై సీఐడీ విచారణ వేగవంతం

By

Published : Jun 23, 2020, 8:52 PM IST

గత ప్రభుత్వంలో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన ఆప్కో ఛైర్మన్ హయాంలో సంస్థలో భారీ అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది. 5 నెలల కిందటే విచారణ ప్రారంభమైనా.. లాక్​డౌన్ కారణంగా దర్యాప్తు నెమ్మదించింది. అయితే 2 రోజుల నుంచి అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు.

భారీ అక్రమాల ఆరోపణలు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు ఆప్కో అందించిన చేనేత వస్త్రాలను యూనిఫాంలుగా అందిస్తున్నారు. ఆప్కో, నేత కార్మికుల వద్ద వస్త్రం కొనుగోలు చేసి.. పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల ద్వారా విద్యార్థులకు యూనిఫాంలు తయారుచేసి ఇవ్వాలి. ఇక్కడే అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. చేనేత కార్మికులు నేసిన వస్త్రం కొనాల్సి ఉండగా.. మరమగ్గాలపై తయారు చేసిన లివరీ రకం వస్త్రాన్ని ఆప్కో కొన్నట్లు అభియోగాలు ఉన్నాయి. చేనేత సంఘాల పేరు మీద వస్త్రాలు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించి భారీ అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై సీఐడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

కడప జిల్లాలో 210 చేనేత సంఘాలు ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని చేనేత సంఘాల పేర్లతో రికార్డులు తయారు చేసినట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. ఇప్పటికే చేనేత సంఘాలను విచారించారు. 2 రోజుల నుంచి కడప ఆప్కో కార్యాలయం, చేనేత, జౌళీ శాఖ ఏడీ కార్యాలయంలో తిరుపతి సీఐడీ డీఎస్పీ రమణ ఆద్వర్యంలో విచారణ చేస్తున్నారు. అక్కడి రికార్డులను పరిశీలిస్తున్నారు. కడప నగరంలోని మోచంపేట ఎస్బీఐ బ్యాంకులో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. ఆప్కో సంస్థ అధికారులు ఎప్పుడెప్పుడు చెక్కులు డ్రా చేశారు, ఎంత రుణం తీసుకున్నారు, ఎవరి పేరు మీద చెక్కులు డ్రా చేసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై వివరాలు వెల్లడించేందుకు సీఐడీ అధికారులు నిరాకరించారు.

ఆప్కో రంగంపై వచ్చిన ఆరోపణలపై సీఐడీ విచారణ ముమ్మరం చేయటంతో... కొందరు నాయకులు, సంబంధిత అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సీఐడీ నివేదిక అందితే ఎవరిపై వేటు పడుతుందోననే భయం అధికారుల్లో నెలకొంది.

ఇవీ చదవండి..

పేదరికంతో ఉన్నతంగా.. సీఏ చదువుతో సేవే మార్గంగా..

ABOUT THE AUTHOR

...view details