Chrysanthemum Cultivation Giving Loss to Farmers :వర్షాభావంతో వైయస్ఆర్ జిల్లాలో పంట పొలాలన్నీ దిగుబడి రాక ఎండిపోతున్న పరిస్థితులు ఒకవైపు ఉంటే.. ధరలు లేక చామంతి తోటలను దున్నేస్తున్న దుర్భిక్ష పరిస్థితులు మరోవైపు కొనసాగుతున్నాయి. కార్తికమాసంలో చామంతి పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ధరలు పడిపోవడంతో రైతులంతా చామంతి పూల తోటలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. కిలో పది రూపాయలు కూడా పలకడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇంత దుర్భిక్షం కళ్లెదుట కనిపిస్తున్నా... ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఒక్క మండలం కూడా కరవు మండలంగా ప్రకటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Chrysanthemum Flower Gardens Plowed with Tractors : పండగ సీజన్ వచ్చిందంటే పూలకు మంచి డిమాండు ఉంటుంది. ఇటీవల దసరాకు మంచి డిమాండు పలికిన చామంతి, బంతి పూలు... కార్తిక మాసంలో ప్రారంభంలోనే ధరలు పడిపోవడం రైతులను తీవ్రంగా నష్టాల్లోకి నెట్టింది. వైయస్ఆర్ జిల్లాలో కమలాపురం, పెండ్లిమర్రి, వల్లూరు, సీకేదిన్నె, ఖాజీపేట, చెన్నూరు, వీఎన్ పల్లె మండలాల్లో రైతులు అత్యధికంగా చామంతి పూల సాగు చేస్తున్నారు.