నివర్ తుపాను బాధితులందరికీ అండగా ఉంటామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటిలో వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. పట్టణంలోని బీరాంసాబ్ వీధి, ఎస్ఎస్ ఆయిల్ వీధి, ఈద్గా రాస్తా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
వరద నీటికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఇళ్లలోకి నీరు చేరి బియ్యం, సామాను దెబ్బతిన్నాయని ప్రజలు శ్రీకాంత్ రెడ్డితో మొరపెట్టుకున్నారు. వారి బాధలు విన్న విప్ తన వంతు సాయంగా ఆర్థిక సహాయం అందజేశారు. నష్టం వివరాలను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాండవ్య నదికి ఇరువైపులా రక్షణ గోడ నిర్మాణానికి అయ్యే వ్యయం అంచనా వేయాలని చెప్పారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని.. అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు.