పెళ్లిళ్లు లేవు.. పండగలు లేవు.. వేడుకల సమయం కూడా కాదు.. కాని చికెన్ ధరలు మండిపోతున్నాయి. ఎందుకిలా దూసుకెళ్తున్నాయి అంటే.. ఎండాకాలం అని చికెన్ దుకాణదారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగినట్టు సరఫరా లేకపోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయంటున్నారు. రవాణా ఛార్జీలు దాదాపు 30 శాతం పెరగడం, కోళ్ల దాణా ధరలు 30 నుంచి 40 శాతం పెరగడం కూడా కారణమని కోళ్ల పరిశ్రమ నిపుణుడు శ్రీకాంత్ చెబుతున్నారు.
గత ఆదివారం స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 210 ఉండగా.. ఈ వారం ధర రూ. 260కి తక్కువ లేకుండా అమ్ముడైంది. కొన్ని చోట్ల స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 270, రూ. 280 వరకూ అమ్మారు. లైవ్ కూడా గత వారం రూ. 125 ఉండగా.. ఈ ఆదివారం రూ. 160కి తగ్గలేదు. సోమవారం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 270 దాటుతుందని దుకాణ దారులు చెబుతున్నారు.
ఊరటనిస్తున్న గుడ్లు..
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోడి కూర తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉడకబెట్టిన రెండు గుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే గుడ్ల ధరలు పెరగకపోవడం ప్రజలకు ఊరటే. గతవారం డజను గుడ్ల ధర రూ. 60 ఉండగా.. ఈ వారం కూడా అంతే ఉంది. అయితే గుడ్డు ధర పెరిగినా అది పైసల్లోనే ఉంటుందంటున్నారు. ఎటొచ్చీ చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని.. దీంతో కొనుగోళ్లు తగ్గాయని దుకాణదారులు చెబుతున్నారు.