ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు సమీక్ష... కడప నివేదిక సిద్ధం..!?

ఈనెల 4 నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో కడప జిల్లా నేతలు నివేదికలు తయారు చేశారు. పోలింగ్ బూత్​ల వారీగా పార్టీ అభ్యర్థులు నివేదికలు తయారుచేశారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతల వివరాలనూ అభ్యర్థులు నివేదికలో పొందుపర్చారు. పోలింగ్ సరళి ఎలా ఉంది... పార్టీకి అనుకూలం, ప్రతికూలాంశాలపై అధినేత సుదీర్ఘంగా చర్చించేందుకు సమాయత్తం అవుతున్నారు.

చంద్రబాబు సమీక్ష... కడప నివేదిక సిద్ధం

By

Published : May 2, 2019, 12:37 PM IST

చంద్రబాబు సమీక్ష... కడప నివేదిక సిద్ధం

ఈనెల 4నుంచి రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలపై తెదేపా అధినేత చంద్రబాబు అమరావతిలో సమీక్ష చేయనున్నారు. కడప జిల్లాలోని కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష... ఈ నెల 14న గాని 16న గాని నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు జిల్లాలోని పార్టీ నేతలు నివేదికలు సిద్ధం చేశారు. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్... జిల్లాలో పార్టీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి... ఎన్ని స్థానాల్లో గెలుస్తున్నామనే దానిపై అధినేత సమీక్ష చేయనున్నారు.

ఇప్పటికే జిల్లాల వారీగా అభ్యర్థులకు ఓ ఫార్మాట్ అందింది. పోలింగ్ బూత్​ల వారీగా పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి... ప్రత్యర్థి పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి... అప్పటి పరిస్థితులపై నివేదిక రూపొందించారు. ఎన్నికల ముందురోజు వరకు పార్టీలోనే ఉండి... పోలింగ్ రోజున ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా పని చేసిన నాయకులేవ్వరూ అనే విషయాన్ని ప్రత్యేకంగా అడిగారు. 2009, 2014లో పోలింగ్ బూత్​ల వారీగా తెదేపాకు వచ్చిన ఓట్లు... ఇపుడు ఎంతమేర వచ్చాయి... నియోజకవర్గాల్లో ప్రభావితం చేసిన అంశాలపై నివేదిక తయారు చేసుకొని సమీక్షకు రావాలని అధిష్ఠానం సూచించింది.

జిల్లాలో 2వేల 726 పోలింగ్ బూత్​లున్నాయి. 22 లక్షల మంది ఓటర్లుండగా... 77 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతిపక్షనేత జగన్ సొంతజిల్లా కావడంతో... పోలింగ్ బూత్​ల వారీగా నివేదికలు పక్కాగా ఉండాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 90 శాతం దాటిన పోలింగ్ కేంద్రాలు ఎన్ని... అక్కడ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి... వాటికి కారణాలేంటి అనే వివరాలను పార్టీ అభ్యర్థులు సేకరించారు.

పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు సరిగా పోల్​ మేనేజ్​మెంట్ చేసుకోలేదని తెలుస్తోంది. ప్రధానంగా కడప, ప్రొద్దుటూరు స్థానాల్లో అభ్యర్థులు వెనకపడ్డారనే సమాచారం అధిష్ఠానం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. కమలాపురంలో చివరి వరకు పార్టీ వెన్నంటే ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పోలింగ్ రోజు తెదేపాకు సహకరించలేదని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పోలింగ్ తరువాతి రోజే వీరశివారెడ్డిని వైకాపా నేతలు పార్టీలోకి ఆహ్వానించడంపై తెదేపా ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తోంది. వీటితోపాటు 23న కౌంటింగ్ వద్ద అనుసరించాల్సిన వ్యూహం... ఈవీఎంలు, వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ అభ్యర్థులు, నేతలకు అధినేత దిశానిర్దేశం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details