chandrababu fires on cm jagan: వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా కూరుకుపోయారని, ఆయనే దోషి అని తాజాగా వెలుగు చూస్తున్న వాంగ్మూలాలతో స్పష్టమవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కేసును మొదటి నుంచీ తప్పుదోవ పట్టిస్తున్న జగన్‌ను సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న తనపై హత్యారోపణ మోపి ఎన్నికల్లో జగన్ లబ్ధి పొందారని రుజువైందన్నారు. సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘తన తండ్రి హత్య విషయంలో న్యాయం చేయాలని సునీత కోరినప్పుడు.. ఒక అన్నగా జగన్ స్పందించిన తీరు చూస్తే ఆయన నైతికంగా పతనమయ్యారని స్పష్టమవుతోందన్నారు. విశ్వసనీయత, విలువలు గురించి మాట్లాడే హక్కుగానీ, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హతగానీ ఆయనకు లేవు. సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది? 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడం... చట్టం అంటే లెక్కలేనితనాన్ని, అవినీతి డబ్బుతో దేన్నైనా మేనేజ్ చేయగలనన్న అహంకారాన్ని తెలియజేస్తోంది’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘వివేకా హత్యలో సూత్రధారి ఎవరన్నది ఇప్పుడు తేలిపోయింది. నాడు గ్యాగ్ ఆర్డర్ తేవడం నుంచి, ఇప్పుడు సీబీఐ విచారణను తప్పు పట్టడం వరకు జగన్ చర్యలన్నీ హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమస్యల నుంచి, ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయ ఎత్తుగడలు అమలు చేస్తున్న జగన్... వివేకా హత్య కేసులో మాత్రం ప్రజల్ని ఏమార్చలేరు’’ అని మండిపడ్డారు. ‘‘హత్య కేసుని పాత్రధారులకే పరిమితం చేసి, సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుడి ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కోటలోనే ఆయన తమ్ముడిని హత్య చేశారంటే, అంతఃపుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమవుతుందా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో చర్చకు వచ్చిన ఇతర ముఖ్యాంశాలు, నేతల అభిప్రాయాలు ఇవీ...
*పోలవరాన్ని సాధారణ బ్యారేజిగా మార్చేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారుతాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.
*పాఠశాలల విలీనం, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియల్లో శాస్త్రీయత లేదని ధ్వజమెత్తారు. జిల్లాల విభజన ప్రక్రియలో తొందరపాటుతో సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు.