భవన నిర్మాణ కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 15న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ఎస్ రాయుడు పిలుపునిచ్చారు. కడప జిల్లా రాజంపేటలో వివిధ కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. రాజంపేటకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెయ్యేరు నుంచి ఇసుక తీసుకువెళ్లి 100 కిలోమీటర్ల దూరంలో డంపు చేసి.. మళ్ళీ అక్కడినుంచి రాజంపేటకు తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీని కారణంగా ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులు వీధిన పడే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కార్మిక సంక్షేమ బోర్డుకు సంబంధించిన సుమారు 400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కరోనా సమయంలో పనుల్లేక ఇబ్బంది పడిన కార్మికుల కుటుంబానికి నెలకు రూ. 10వేలు చొప్పున ఇవ్వాలని 4 నెలలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. కార్మిక సంక్షేమ నిధికి సంబంధించిన డబ్బులు మాత్రం అడగని వారికి పంచి పెట్టారన్నారు. విజయవాడలో తలపెట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. పోరాటం ద్వారానే హక్కులు కాపాడుకుందామని, సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు.