కడప జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకదృష్టి పెట్టాయి. కరోనా రెండో దశ వ్యాప్తి సందర్భంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల్లో గతకొన్నిరోజులుగా ఎప్పటికప్పుడు ప్రాణవాయువు పడకలు నిండిపోతున్నాయి. ఎవరైనా అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే వారికి ఆక్సిజన్ అందించడం కష్టమవుతోంది. జిల్లా అవసరాలకు సరిపడా లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు సరఫరా కాకపోవడంతో పడకల సంఖ్యను పెంచలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల వద్దనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం గాలిలో నుంచి ఆక్సిజన్‌ను వేరుచేసే ప్రెషర్ స్వింగ్ అడ్సార్షన్ (పీఎస్‌ఏ) సాంకేతికత ద్వారా పనిచేసే ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం జిల్లాకు కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి రోజూ 17.5 కిలోలీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంవో) సరఫరా అవుతోంది. దీన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉన్న ట్యాంకర్లలోకి నింపి, అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా రోగులకు అందిస్తున్నారు. జిల్లా అవసరాలను తీర్చేందుకు మరికొన్ని ఎల్‌ఎంవో నిల్వలు కేటాయించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో పీఎస్‌ఏ ప్లాంట్లు సత్వరం ఏర్పాటైతే జిల్లావాసులకు ఊరట లభిస్తుంది.
కొత్తగా 250 పడకలకు ఆక్సిజన్ !
సాధారణంగా ఒక్కో రోగికి వారి ఆరోగ్య పరిస్థితిని ఆక్సిజన్ సరఫరా స్థాయిని నిర్ణయిస్తారు. కొందరికి ఎక్కువ, మరికొందరికి తక్కువస్థాయిలో అందిస్తున్నారు. ఒక రోగికి సగటున నిమిషానికి 20 లీటర్ల (20 ఎల్‌పీఎం) ఆక్సిజన్ అవసరమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో మూడు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటుచేయనున్న ప్లాంట్ల ద్వారా కొత్తగా సుమారు 250 పడకలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది.
కొత్తగా ట్యాంకర్ల ఏర్పాటు..
ఒకవేళ జిల్లాకు బయట ప్రాంతాల నుంచి ఎల్‌ఎంవో కేటాయింపులు పెరిగితే వాటిని నిల్వ చేసుకోవడానికి ట్యాంకర్ల ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం కడప సర్వజన ఆసుపత్రిలో 13 కిలోలీటర్ల (కి.లీ.) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకరు అందుబాటులో ఉంది. ఇటీవల భారతి సిమెంట్స్ ఆధ్వర్యంలో 20 కి.లీ. ట్యాంకరును ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన పైపులైన్ల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఫాతిమా వైద్య కళాశాలలో ప్రస్తుతం ఒక కి.లీ. ట్యాంకరు మాత్రమే అందుబాటులో ఉండగా.. కొత్తగా 11 కి.లీ. సామర్థ్యం ఉండేదాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, పులివెందులో ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులు సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు.
విదేశాల నుంచి జియోలైట్ దిగుమతి
దేశవ్యాప్తంగా చాలా చోట్ల పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం పీఎం కేర్ ఫండ్స్‌ను వినియోగించనున్నారు. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో అవసరమైన పరికరాలను అందజేయనున్నారు. గాలిలో నుంచి ఆక్సిజన్‌ను వేరుచేయడానికి జియోలైట్ అనే ఖనిజం అవసరమవుతుంది. దీన్ని వివిధ దేశాల నుంచి తెప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఎయిరిండియా ప్రత్యేకంగా కార్గో సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. యంత్రాల సరఫరా నుంచి వాటిని అమర్చటం వరకు కేంద్రమే నిర్వహించనుంది. పీఎస్‌ఏ ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అప్పగించనున్నారు. పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించనుంది. వాటి కోసం షెడ్లు, ఇతర నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించనుంది.
త్వరలో పనులు ప్రారంభం
జిల్లాలో మూడు చోట్ల పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వీటి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపడతారని అంటున్నారు. ఆ శాఖాధికారులకు ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే జిల్లా అవసరాలు తీరుతాయి. - సురేంద్రనాథ్‌రెడ్డి, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ
ఇదీ చదవండి..'వైఎస్సార్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల