వైస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ నాలుగో దశ విచారణ చేపట్టింది. ఈ కేసులో కీలకమైన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. గతంలో నెల రోజుల పాటు విచారణ చేయగా, మరోసారి ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో మరికొందరు అనుమానితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివేకానందరెడ్డి హత్య కేసును చేధించడానికి రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... మరోసారి జోరుగా విచారణ చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటికే మూడు దఫాలుగా కడప, పులివెందులలో అనుమానితులను విచారించిన సీబీఐ అధికారులు... ఇప్పుడు నాలుగో దఫా విచారణ మొదలుపెట్టారు. చెన్నైకి చెందిన ఎస్పీ స్థాయి సీబీఐ అధికారి ఆధ్వర్యంలో... ఆరుగురు అధికారుల బృందం విచారణ ప్రక్రియలో పాల్గొంటోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో సోమవారం కారు డ్రైవర్ దస్తగిరిని 7 గంటల పాటు ప్రశ్నించారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరగ్గా.... అంతకు ఆరు నెలల ముందు దస్తగిరి డ్రైవర్ పని మానేశాడు.
అయితే అతన్నే అధికారులు పలుదఫాలుగా విచారణ చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు.... వారం రోజుల పాటు అనుమానితులను విచారించారు. ఆ సమయంలో కూడా దస్తగిరి తల్లిదండ్రులను ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కదిరిలో దుకాణం నిర్వహిస్తున్నారనే సమాచారంతో అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత దస్తగిరిని దిల్లీకి తీసుకెళ్లిన సీబీఐ అధికారులు... దాదాపు నెల రోజుల పాటు విచారించారు. పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు దిల్లీకి పిలిపించినా... దస్తగిరిని నెల రోజుల పాటు అక్కడే ఉంచడం, కడపకు వచ్చిన తర్వాత మళ్లీ విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకా కారు డ్రైవర్‌గా ఎన్నిరోజులు పనిచేసింది, ఎందుకు మానేయాల్సి వచ్చింది, దానికి దారితీసిన పరిస్థితులేంటి అనే విషయాలు ఆరా తీసినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఏమైనా విబేధాలు ఉన్నాయా, ఆయనతో పనిచేసే సమయంలో ఎలా వ్యవహరించేవారనే కోణంలోనూ సీబీఐ అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
కడప అతిథి గృహంలో 7 గంటల పాటు మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని విచారించిన సీబీఐ అధికారులు... అనంతరం పులివెందులకు తీసుకెళ్లారు. పులివెందులలోని వివేకా ఇంటి పరిసరాలను మరోసారి పరిశీలించారు. పులివెందుల రింగ్ రోడ్డు చుట్టూ కారులో తిరిగి, మళ్లీ కడపకు చేరుకున్నారు. మరికొందరు అనుమానితులను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
Covid Third Wave: పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి: సీఎం జగన్