ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

viveka murder case: వివేకా హత్యలో ఉమాశంకర్‌,సునీల్‌ పాత్ర - viveka-murder-case

ys
ys

By

Published : Sep 9, 2021, 9:26 PM IST

Updated : Sep 10, 2021, 4:47 AM IST

21:21 September 09

పులివెందుల కోర్టులో రిమాండ్‌ రిపోర్టు సమర్పించిన సీబీఐ

 మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, యాదాటి సునీల్‌కుమార్‌యాదవ్‌ పాత్ర ఉన్నట్లు సీబీఐ కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. 2019 మార్చి 14వ తేదీ (హత్యకు ముందు రోజు) రాత్రి వారిద్దరూ వివేకా ఇంటి వద్దకు ద్విచక్రవాహనంపై వచ్చారని, అనంతరం అదే వాహనంలోని సైడు బ్యాగులో వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి దాచుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిపింది. వాహనాన్ని ఈ ఏడాది ఆగస్టు 8న స్వాధీనం చేసుకున్నామని, దాని సైడు బ్యాగును గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇతర సంస్థలకు పంపించి శాస్త్రీయంగా ఈ వివరాలు ధ్రువీకరించామంది. కేసు దర్యాప్తునకు సహకరించట్లేదని ఉమాశంకర్‌రెడ్డి (37)ని గురువారం మధ్యాహ్నం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పులివెందుల జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తరలించగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. దీంతో ఉమాశంకర్‌రెడ్డిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఉమాశంకర్‌రెడ్డిని అయిదు రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది.

సునీల్‌, దస్తగిరి వాంగ్మూలంలో చెప్పారు

‘వివేకానందరెడ్డి హత్య కేసులో ఉమాశంకర్‌రెడ్డి పాత్రను సునీల్‌యాదవ్‌, దస్తగిరి తమ వాంగ్మూలంలో ధ్రువీకరించారు. హత్యకు ఆటంకం కలిగిస్తుందేమోనన్న అనుమానంతో.. వివేకా ఇంటి సమీపంలో ఉండే కుక్కను సునీల్‌యాదవ్‌తో కలిసి ఉమాశంకర్‌రెడ్డి తన కారుతో గుద్ది చంపారు. ఆగస్టు 11న ఉమాశంకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు తెలుపు, లేత నీలం రంగు చొక్కాలను, సునీల్‌ యాదవ్‌, ఇతర అనుమానితుల ఇంట్లో రక్తపు మరకలతో కూడిన చొక్కాలను స్వాధీనం చేసుకున్నాం. వాటికి సంబంధించి చండీగఢ్‌లోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి నివేదిక రావాల్సి ఉంది. వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి లేదా ఇతర ఆయుధాలను గుర్తించే ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. ఉమాశంకర్‌రెడ్డిని గురువారం విచారణకు పిలిచి కీలక అంశాలపై ప్రశ్నించగా సరైన సమాధానాలు ఇవ్వలేదు. అతనికి తెలిసిన విషయాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు, హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు అతణ్ని కస్టడీలోకి తీసుకోవడం చాలా అవసరం’ అని కస్టడీ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. ఈ పిటిషన్‌పై ఈ నెల 13న విచారణ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి పులివెందుల కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో అతని భార్య అక్కడికి వచ్చారు. తన భర్తకు ఏమైనా జరిగితే సీబీఐ అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

వివేకా పీఏ జగదీశ్వర్‌రెడ్డికి తమ్ముడు

కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పులివెందుల ఆర్టీసీ బస్టాండు ఎదురుగా మహాశివగంగభవాని పాల డెయిరీ నిర్వహిస్తున్నారు. అతను వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటూ పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డికి తమ్ముడు. వీరికి మొదటి నుంచి వివేకా, ఆయన కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సింహాద్రిపురం మండలం రావులకొలనులో వివేకా పొలాలను, మినీ పాల కేంద్ర నిర్వహణ బాధ్యతలను జగదీశ్వర్‌రెడ్డి చూస్తున్నారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్‌యాదవ్‌ను ఉమాశంకర్‌రెడ్డే వివేకాకు పరిచయం చేసినట్లు సమాచారం.

సీసీ ఫుటేజీలను ఎవరు సేకరించారు?

వివేకా హత్య కేసు విచారణకు ప్రభుత్వం నియమించిన అప్పటి సిట్‌ బృందంలోని ఎస్సై జీవన్‌రెడ్డి, మరో ఇద్దరు పోలీసు అధికారులను సీబీఐ అధికారులు గురువారం విచారణకు పిలిపించారు. హత్య జరిగినప్పుడు ఆయన నివాస పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల నుంచి ఫుటేజీలను ఎవరు సేకరించారు? వాటిని ఎవరికిచ్చారు, ఫుటేజీల్లోని దృశ్యాలను మీరేమైనా చూశారా అని ప్రశ్నించినట్లు తెలిసింది.

అనుబంధకథనం

VIVEKA MURDER CASE: వైఎస్‌ వివేకా హత్యకేసు..మరో నిందితుడు అరెస్టు

Last Updated : Sep 10, 2021, 4:47 AM IST

ABOUT THE AUTHOR

...view details