CBI Notices to MP Avinash Reddy: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. ఈనెల 22 విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత రెండుసార్లు ఇచ్చిన నోటీసులకు వివిధ కారణాలతో అవినాష్ రెడ్డి.. డుమ్మా కొట్టారు. అవినాష్‌రెడ్డి ఈసారి కూడా విచారణకు హాజరుకాకుంటే.. సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణ నోటీసులు పర్వం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది. ఈనెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి హైదరాబాద్‌లోని కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. వాట్సప్ ద్వారా సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు పంపించారు. అయితే అవినాష్ ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ నెలలోనే రెండు సార్లు డుమ్మా కొట్టారు. ఈనెల 16, 19వ తేదీల్లో సీబీఐ విచారణకు పిలువగా.. ఆఖరి నిమిషంలో విచారణకు రాలేనంటూ లేఖలు రాశారు.
వివేకా హత్యకేసులో విచారణకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు డుమ్మా కొట్టారు. ఈనెల 19న విచారణకు హాజరు కావడానికి బయలుదేరిన ఆయన..చివరి నిమిషంలో తన తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగాలేదంటూ పులివెందుల వెళ్లిపోయారు. తన తల్లికి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల విచారణకు రాలేనంటూ.. సీబీఐకి సమాచారం పంపించారు. ప్రస్తుతం ఆరోగ్యం బాలేని తన తల్లితో ఉన్న అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది.
వివేకా హత్య కేసులో విచారణకు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు అవినాష్ రెడ్డి గైర్హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలు, తల్లి అనారోగ్యం లాంటి పలు రకాల కారణాలతో.. విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు. అరెస్టు కాకుండా వీలైనన్ని ఎక్కువ రోజులు తాత్సారం చేసేందుకే.. ఎప్పటికప్పుడు కొత్త సాకులు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఈ నెలలో రెండు సార్లు సీబీఐ విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ రెడ్డి.. సోమవారం వెళ్తారా లేదా అని వేచి చూడాలి. ఒకవేళ ఆ రోజు విచారణకు గైర్హాజరైతే.. తర్వాత సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి: