మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు YS viveka murder case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగనున్న విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సీబీఐ ఉచ్చు బిగిస్తోందా..వివేకానందరెడ్డి హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. వివేకా హత్యలో కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు ఇప్పటికే మూడుసార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ... నేడు భాస్కర్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో తండ్రీకుమారులు అనుమానితులుగా ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించామని సీబీఐ ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఈ నెల 13 వరకు అవినాష్‌రెడ్డిపై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భాస్కర్ రెడ్డిని నేడు ఉదయం 10 గంటలకు కడపలో విచారణకు పిలవడం చర్చనీయాంశంగా మారింది.
సుదీర్ఘ విరామానంతరం.. భాస్కర్ రెడ్డిని ఏడాది కిందట వరసగా రెండురోజుల పాటు పులివెందులలో సీబీఐ విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆదివారం విచారణకు పిలిచారు. గత నెల 23నే విచారణకు రావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందించినా... వ్యక్తిగత కారణాలతో గడువు కోరారు. ఈ నెల 5వ తేదీన మరోసారి నోటీసులు అందజేసిన సీబీఐ అధికారులు... ఈ నెల 12న కడపలో విచారణకు రావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చారు. దీంతో భాస్కర్‌రెడ్డి కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.
సీబీఐ కౌంటర్ అఫిడవిట్... 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలు చెరిపివేస్తున్న సమయంలో భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలంలోనే ఉన్నారనేది సీబీఐ అభియోగం. వివేకా హత్యకు కుట్ర పన్నిన వారిలో అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితోపాటు భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, హత్యకు ముందు రోజైన మార్చి 14న ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్.. భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు సీబీఐ తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది. పథకం ప్రకారం భాస్కర్ రెడ్డి తన రెండు సెల్ ఫోన్లను స్విచాఫ్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. వివేకా హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ వెనుక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయన్నది సీబీఐ భావన. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. నేడు భాస్కర్ రెడ్డిని విచారించే సమయంలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పులివెందుల నుంచి భారీగా కార్యకర్తలు కడపకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి :