CBI Inquiry Viveka PA Krishna Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకాకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారించారు. సుమారు అయిదు గంటలపాటు పలు అంశాలపై ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను ఎందుకు దాచిపెట్టాల్సివచ్చిందనే విషయం పైనే చాలా సేపు ప్రశ్నించినట్లు తెలిసింది. తనపై దాడి జరిగిన సమయంలో వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖ ఘటనాస్థలిలో ముందుగా కృష్ణారెడ్డి చేతికే చిక్కింది.
ఉదయం దొరికిన ఆ లేఖను పోలీసులు అక్కడికి చేరుకోగానే పీఏ కృష్ణారెడ్డి వారికి ఇవ్వలేదు. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి దాన్ని దాచి ఉంచమని తనకు సూచించినట్లు కృష్ణారెడ్డి తర్వాత వెల్లడించారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేశారన్న కారణంతో హత్య జరిగిన రోజే కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఈ లేఖ విషయమై కడప ఎంపీ అవినాష్ రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. లేఖను ఎందుకు దాచారనే కోణంలో సీబీఐ దర్యాప్తు జరగడం లేదని.. తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని విచారిస్తున్నారంటూ ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. నాలుగు రోజుల క్రితమే సీబీఐ అధికారులు పులివెందులలో కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో కుటుంబసభ్యులతో సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసు పంపారు. దీంతో మంగళవారం కృష్ణారెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు.