మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. 11వ రోజు నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు దాదాపు 7 గంటల పాటు కడపలో ప్రశ్నించారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో పది మంది సీబీఐ అధికారుల బృందం.. అనుమానితులను విచారించారు. వీరిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డిని సుదీర్ఘంగా విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 మార్చి 15న హత్య జరిగిన రాత్రికి ముందు ఎన్నికల ప్రచారానికి వివేకాతో కలిసి కారులో వెళ్లింది ఎర్రగంగిరెడ్డే. వివేకా ఇంటినుంచి బయటికి వెళ్తే... ఎర్రగంగిరెడ్డి వెంట ఉండేవాడు. హత్య జరిగిన రోజు ఉదయం ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై ఎర్రగంగిరెడ్డితోపాటు కృష్ణారెడ్డి, ప్రకాశ్ అనే వ్యక్తులను రెండేళ్ల కిందట సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిలుపై ఉన్న ఎర్రగంగిరెడ్డిని సీబీఐ అధికారులు మరోమారు కడపకు పిలిచి విచారించారు. ఇతనితోపాటు సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి, ఆయన భార్య మహేశ్వరిని విచారణకు పిలిచారు. వివేకా వ్యవసాయ పొలం పనులు చూసే జగదీశ్వర్ రెడ్డి...ఆయనతో సన్నిహితంగా ఉండే వాడని తెలిసింది. 2 రోజుల పాటు జగదీశ్వర్ రెడ్డిని ప్రశ్నించగా... ఆయన భార్య మహేశ్వరిని కూడా విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది. వీరితోపాటు గతంలో వివేకాతో సన్నిహితంగా ఉండే పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్ ను సీబీఐ విచారణకు పిలిచింది.కాల్ డేటా ఆధారంగా సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నేడు మరికొందరు అనుమానితులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
cbi enquiry: వివేకా హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ - viveka murder case
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
వివేకా హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ
Last Updated : Jun 18, 2021, 4:28 AM IST