మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో సీబీఐ వేగం పెంచింది. ఆరు నెలల తరువాత మూడో దఫా పులివెందులకు చేరుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం రాత్రి చేరుకున్న సీబీఐ బృందం.. ఇవాళ అర్అండ్బీ అతిథి గృహంలో పలువురుని విచారించింది. ఇవాళ ఉదయం వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వివేకా వ్యక్తిగత కార్యదర్శి హిదాయ్ తుల్లాను విచారించారు. వివేకా ఇంటిని 3 గంటల పాటు పరిశీలించిన సీబీఐ అధికారులు..హత్య జరిగిన పడకగది, స్నానపు గదిలో ఆధారాలు సేకరించారు.
2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన సమయంలో ఇంట్లో రక్తపు మరకలు తుడిచిన కేసులో ఎర్రగంగిరెడ్డిని మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన ఎర్రగంగిరెడ్డిని సీబీఐ అధికారులు ఇవాళ విచారణకు పిలిచారు. ఘటన జరిగిన రోజు ఎందుకు రక్తపు మరకలు తుడిచావనే కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. ఎవరు చెబితే రక్తపు మరకలు తుడవాల్సి వచ్చింది వంటి ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తోంది. హిదాయ్ తుల్లాను కూడా అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. హత్య జరిగిన సమయంలో ఉదయం 6 గంటలకు వివేకా ఇంట్లో ఆయన కూడా ఉన్నారు. బాత్ రూంలో రక్తపు మడుగులో హత్యకు గురైన వివేకా మృతదేహాం ఫోటోలను మొబైల్ లో తీసింది హిదాయ్ తుల్లానే. ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.