ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు.. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్‌ - Devireddy Shiva Shankar Reddy news

YS Viveka Murder Case
YS Viveka Murder Case

By

Published : Feb 4, 2022, 4:18 PM IST

Updated : Feb 5, 2022, 4:46 AM IST

16:14 February 04

పులివెందుల కోర్టులో ఛార్జిషీట్ వేసిన సీబీఐ అధికారులు

YS Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి అని, ఘటనా స్థలంలోని ఆధారాలన్నింటినీ ఆయన ధ్వంసం చేశారని సీబీఐ అభియోగాలు మోపింది. ఈ కేసులో ఆయన్ని నిందితుడిగా పేర్కొంటూ పులివెందుల న్యాయస్థానంలో శుక్రవారం అభియోగపత్రం దాఖలు చేసింది. గతేడాది నవంబరు 17న హైదరాబాద్‌లో శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ని విచారించారు. వివేకా హత్య కేసులో ఆయన ప్రమేయానికి సంబంధించి దర్యాప్తులో కొన్ని కీలక అంశాలు గుర్తించారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయా వివరాలను గతంలో న్యాయస్థానం ముందు ఉంచారు. ఈ హత్య కేసులో శివశంకర్‌రెడ్డి పాత్రకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో గుర్తించిన అంశాలు ఇలా ఉన్నాయి.

  • ‘‘వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు. మేమూ నీతోపాటు వస్తాం. దీని వెనుక వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’’ అంటూ... ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి న్యాయమూర్తి, సీబీఐ అధికారుల ఎదుట ఇచ్చిన వేర్వేరు వాంగ్మూలాల్లో పేర్కొన్నాడు.
  • వివేకా హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే కట్టుకథను రూపొందించిన వారిలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన భాగస్వామి. వివేకా మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండి, ఆయన శరీరంపై గాయాలున్నప్పటికీ గుండెపోటుతో చనిపోయారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అందరినీ నమ్మించేందుకు వివేకా పడక, స్నానపు గదుల్లోని రక్తపు మరకలను తుడిపించేశారు. వివేకా శరీరంపై ఉన్న గాయాలకు కట్లు వేయించారు. ఆ సమయంలో లోపలి నుంచి తలుపులు వేసేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ చెబుతామని... ఈ వ్యవహారంలో నోరు మూసుకుని ఉండాలి అంటూ అప్పటి సీఐ శంకరయ్యను, ఘటనా స్థలంలోని సాక్షుల్ని శివశంకర్‌రెడ్డి దుర్భాషలాడారు.
  • వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన సన్నిహితులు కుట్ర చేశారు. హత్యకు నెల రోజుల ముందే దీనికి రూపకల్పన జరిగింది. వివేకాను చంపితే భారీ మొత్తంలో డబ్బులిస్తానని యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిలకు శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ చేశారు.
  • ఈ కేసులో సీబీఐ ఎదుట తన పేరు చెప్పొద్దని... అలా అయితే నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తానంటూ అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరిని శివశంకర్‌రెడ్డి ప్రలోభపెట్టారు.

ఇదీ చూడండి:అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!

Last Updated : Feb 5, 2022, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details