మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన సీబీఐ... ఇవాళ్టి నుంచి కడప కేంద్రంగా విచారణ చేపట్టింది. 10 రోజులపాటు పులివెందులలో ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అధికారులు వివేకా ఇంటిని పరిశీలించారు. సిట్ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 సంచుల్లో ఉన్న నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు ఈరోజు నుంచి ప్రత్యేక విచారణ అధికారి సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ మేరకు కడప ఆర్అండ్బీ కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి అధికారులు చేరుకున్నారు.
అక్కడే దస్త్రాలను పరిశీలించి.. అనుమానితులను పిలిపించి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే 15 మంది అనుమానితుల జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డితో పాటు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు సస్పెన్షన్లో ఉన్నపులివెందుల సీఐ శంకరయ్యను విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజు శంకరయ్య ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.