ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పు తీర్చమన్నందుకు.. విశాంత్ర ఉద్యోగి దారుణహత్య - brutal murder kadapa district

ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ విశ్రాంత ఉద్యోగిని దారుణంగా హత్య చేసిన ఘటన కడప జిల్లాలో సంచలనం రేపింది. కిరాయి హంతకుల చేత విశ్రాంత ఉద్యోగిని హత్య చేయించడమే కాకుండా... శవాన్ని నిందితుడు తన ఇంట్లోనే పాతి పెట్టాడు. తల ఒక చోట...మొండెం మరోచోట పాతి పెట్టడం కలకలం రేపుతోంది. ఎర్రగుంట్లలో జరిగిన దారుణ ఘటనపై ప్రధాన నిందితుడైన మాజీ మున్సిపల్ ఛైర్మన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

brutal murder at yerraguntla kadapa district
విశాంత్ర ఉద్యోగి దారుణహత్య

By

Published : Jun 24, 2020, 9:10 PM IST

విశాంత్ర ఉద్యోగి దారుణహత్య

కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన వెంకటరమణయ్య స్థానికంగా ఉన్న ఇండియా సిమెంట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చెందారు. తాను సంపాదించుకున్న డబ్బులను స్థానికంగా ఉన్నవారికి వడ్డీలకు అప్పులిచ్చేవాడు. ఇదే విధంగా యర్రగుంట్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్యకు కూడా 30 లక్షల రూపాయల వరకు అప్పు ఇచ్చాడు.

ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ముసలయ్యపై పదేపదే రమణయ్య ఒత్తిడి తెచ్చాడు. అంత పెద్దమొత్తం ఒకేసారి ఇవ్వడానికి డబ్బులు లేకపోగా.. వెంకటరమణయ్య నుంచి ఒత్తిడి తీవ్రం కావటంతో తీవ్ర వేదనకు గురైనా ముసలయ్య, ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని పథకం వేశాడు. కిరాయి హంతకులను మాట్లాడుకుని వెంకటరమణయ్యను అంతమొందిస్తే... డబ్బులు ఇవ్వాల్సిన పని ఉండదని గ్రహించాడు.

ఈనెల 20న వెంకట రమణయ్యకు ఫోన్ చేసి ఇంటికి రావాలని ముసలయ్య పిలిచాడు. ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా ముందే ముసలయ్య ఇంట్లో దాక్కున్న కిరాయి హంతకులు వెంకటరమణయ్యపై దాడి చేశారు. ముసలయ్య ఎదురుగానే కత్తులతో దారుణంగా గొంతు కోశారు. ఏకంగా తల, మొండెం వేరు చేశారు. మొండాన్ని ముసలయ్య ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి పాతి పెట్టారు.

టిఫిన్ బాక్స్​లో తల..

తలను మాత్రం టిఫిన్ బాక్సులో వేసుకుని... దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్​లో పడేశారు. తర్వాత కిరాయి హంతకులు పారిపోగా... ముసలయ్య మాత్రం ఏమీ తెలియనట్లుగా గ్రామంలో తిరిగాడు. ఈనెల 20వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన వెంకటరమణయ్య తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా గాలించారు. చివరికి ఈనెల 22న యర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తి అదృశ్యం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రంగంలో దిగిన పోలీసులు...

అతనికి చివరి ఫోన్ కాల్ ముసలయ్య నుంచి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు... యర్రగుంట్లలోని ఆయన ఇంటికి వెళ్లారు. తమదైన శైలిలో ముసలయ్యను ప్రశ్నిస్తే అసలు విషయాన్ని బయటపెట్టాడు. రంగంలోకి దిగిన కడప డీఎస్పీ సూర్యనారాయణ ముసలయ్యను అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని బయటికి తీస్తే మొండెం మాత్రమే కనిపించింది. తల ఎక్కుడుందని ప్రశ్నిస్తే గువ్వలచెరువు ఘాట్​లో వేసినట్లు నిందితుడు తెలిపారు. నిందితున్ని వెంట బెట్టుకుని తల పడేసిన ప్రదేశానికి వెళ్లిన పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం శవాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: తల ఓ చోట.. మొండెం మరో చోట: ఎర్రగుంట్లలో విశ్రాంత ఉద్యోగి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details