ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రహ్మంగారిమఠంలో కొలిక్కి వచ్చిన పీఠాధిపత్య వివాదం - బ్రహ్మంగారి మఠాం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి వార్తలు

పోతులూరి వీరబ్రహ్మేందస్వామి మఠం పీఠాధిపత్యంపై వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నెలరోజులపాటు కుటుంబ సభ్యుల మధ్య నలిగిన వివాదానికి అధికారులు పరిష్కార మార్గం చూపారు. దివంగత పీఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామికే పీఠాధిపత్యం కట్టబెట్టేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. త్వరలోనే 12వ పీఠాధిపతిగా ఆయన ప్రమాణం చేయనున్నారు.

brahmamgari-matham-issue-solved
brahmamgari-matham-issue-solved

By

Published : Jun 27, 2021, 5:52 AM IST

కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోనే పోతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి నియమించబడ్డారు. నెలరోజులుగా వారసత్వ వ్యవహారంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వివాదాన్ని ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించింది. ప్రత్యేక అధికారి, స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి.. వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు.

గత నెల 8న మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి శివైక్యం పొందగా.. అప్పటి నుంచి తదుపరి పీఠాధిపతి ఎవరన్న దానిపై వారసుల మధ్య వివాదం నడుస్తోంది. వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కుమారులు, రెండోభార్య కుమారులు పీఠాధిపత్యం కోసం పట్టుబట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాల మఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారం తేల్చేందుకు దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను నియమించింది. ఆయన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. పీఠాధిపతిగా మొదటి భార్య పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, ఉత్తరాధి పీఠాధిపతిగా రెండో కుమారుడు భద్రయ్యస్వామిని నియమించేలా కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. వీరి తదనంతరం.. రెండో భార్య కుమారుడు గోవిందస్వామికి పీఠాధిపతి అవకాశం దక్కనుంది. ఈ మేరకు రాతపూర్వక హామీ ఇచ్చారు.

నెలరోజుల పాటు బ్రహ్మంగారిమఠంలో నెలకొన్న వివాదానికి తెరపడటంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. మఠం పవిత్రతను కాపాడేందుకు అందరూ కృషి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:Permits Postponed: రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతులు వాయిదా

ABOUT THE AUTHOR

...view details