బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక వివాదానికి ఈ సాయంత్రం తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ మఠానికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు, పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. అన్నదాన సత్రాలు పర్యవేక్షించారు. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పెద్ద భార్య నలుగురు కుమారులు, రెండవ భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఇద్దరు కుమారులతో మాట్లాడి.. సాయంత్రం నిర్ణయం తెలపనున్నారు.
మఠం పీఠాధిపతిగా.. వెంకటేశ్వరస్వామి మొదటి భార్య చంద్రావతమ్మ మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామిని ఖరారు చేసే అవకాశం ఉందని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. పీఠాధిపతి వ్యవహారంలో కుటుంబీకులంతా ఎమ్మెల్యేను ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో కలిశారు. మఠం పీఠాధిపతి ఎంపిక అంశం ఒక కొలిక్కి వచ్చిందని, కుటుంబ సభ్యులు అంతా ఏకాభిప్రాయానికి వచ్చారని ఎమ్మెల్యే ఈ సందర్బంగా చెప్పారు. మఠంలో ఉన్న పూర్వ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతీ మహాలక్షమ్మ సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారి సమక్షంలో ఈ సాయంత్రం ప్రకటిస్తామన్నారు.