ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భావి పౌరులకు ‘పుస్తక నేస్తం’ - కడప పుస్తకాలు తాజా వార్తలు

తరగతి గదిలో చదువు విద్యార్థికి విజ్ఞానాన్నిస్తుంది. పుస్తకాల పఠనంతో విద్యార్థి వ్యక్తిత్వం పరిమళిస్తుంది. సామాన్యులనైనా సమున్నతంగా మారుస్తుంది. పుస్తకాల విలువ వెలకట్టలేనిది. బాధల్లో ఓదార్పునిస్తాయి. విజయానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తాయి. విశ్వాసాన్ని పెంచుతాయి.. మనిషి నడక.. సమాజంలో నడతను నేర్పుతాయి. జీవితమంటే అర్థం తెలిసేలా జ్ఞాన దీపాలు వెలిగిస్తాయి. వందల ఏళ్లనాటి ప్రజల జీవనశైలి, రాజుల పాలనా వ్యవస్థ, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, సనాతన ధర్మం, రాజకీయాలు, పరిపాలన, సాంకేతికతకు పుస్తకాలు, గ్రంథాలు సాక్షీభూతంగా నిలుస్తాయి. ప్రస్తుతం కాలంతోపాటే పుస్తకాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. పఠనం తగ్గింది. ఈ నేపథ్యంలో భావి పౌరుల్లో పుస్తకాలపై ఆసక్తిని పెంపొందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విజ్ఞానం ప్రసాదించే అమూల్య పుస్తకాలను తెప్పించి సరఫరా చేస్తున్నారు.

books broutght from mysore in kadapa district
పాఠశాలలకు మైసూరు నుంచి తెప్పించిన పుస్తకాలు

By

Published : Jul 23, 2020, 5:54 PM IST

కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 3,253 ఉన్నాయి. బాల, బాలికలు 2.63 లక్షల మంది ఉన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. బడులు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పునఃప్రారంభంలో ఆలస్యమైంది. ఇప్పటికే దూరదర్శన్‌, సప్తగిరి, యూట్యూబ్‌ తదితర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే విద్యా వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా పాఠ్యాంశాలపై నైపుణ్యం ఉన్న బోధకులు, నిపుణుల సలహాలు, సూచనలను ప్రసారం చేస్తున్నారు. అవగాహన కల్పించే యత్నం జరుగుతోంది.

రేపటి పౌరుల్లో మరింత పఠనాసక్తి పెంపొందించాలని కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ‘పుస్తక నేస్తం’ పేరిట మరో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని భారతీయ భాషాధ్యయన కేంద్రం నుంచి పుస్తకాలను తెప్పించారు. సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు ఇప్పటికే మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని బడులకు ఇవ్వడం లేదు.

ఇప్పుడు 2,729 సరస్వతీ నిలయాలకు ఇవ్వాలని తెప్పించారు. ప్రాథమిక 2,098, ప్రాథమికోన్నత పాఠశాలలు 194కు సరఫరా చేయాలని అనుమతిచ్చారు. ఒక్కో బడికి 30 పుస్తకాలు ఇస్తున్నారు. సెకండరీ విద్యలో ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, జూనియర్‌ కళాశాలలు కలిపి 437కు సరఫరా చేస్తారు. ఈ విద్యాలయాలకు 50 చొప్పున ఇస్తారు. ఇందులో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉన్నాయి. 1-10వ తరగతి వరకు ఉన్నచోట 82 అందిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విభాగంలో 73,344, సెకండరీ విద్యార్థుల కోసం 21,850 వచ్చాయి. ఎస్‌ఎస్‌ఏ ద్వారా ఇప్పటికే మండలాల ఎంఈవో కార్యాలయాలు, మండల రిసోర్సు కేంద్రాలకు పంపించారు. అక్కడి నుంచి ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇవ్వనున్నారు.

ఏం చేస్తారంటే..

సరఫరా చేసే పుస్తకాల్లో పలు అంశాలవి ఉంటాయి. వీటిని తీసుకొని గురువులు తమ విద్యాలయంలో ఉన్న గ్రంథాలయంలో నమోదు చేయాలి. సమీపంలో నివాసం ఉంటున్న విద్యార్థులకు అందించి వారిలో పాఠకాసక్తి పెంచుతారు. పఠనంపై శ్రద్ధ పెరిగేలా వెన్నుతట్టి ప్రోత్సహించనున్నారు. ఈ పుస్తకాలు ఉన్నత విద్యలో రాణించేందుకు, పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు ఎంతగానో దోహదపడతాయి. చిరుప్రాయంలోనే విజ్ఞాన సముపార్జనకు బీజం వేస్తే వారి సర్వతోముఖాభివృద్ధి మెరుగ్గా ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.

విద్యార్థుల్లో విజ్ఞానం పెంపు

పుస్తక పఠనంతో విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుంది. భాషపై పట్టు సాధించవచ్ఛు పిల్లలకు పుస్తకాలు అందించే సమయంలో కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ నిబంధనలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్ర ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మైసూరు నుంచి పుస్తకాలను తెప్పించాం. ఆయా మండలాల కేంద్రాలకు పంపించాం. పాఠశాలలకు ఎంఈవోల ఆధ్వర్యంలో అందిస్తారు. - అంబవరం ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పథక అధికారి,సమగ్ర శిక్షా అభియాన్‌, కడప

ఇదీ చదవండి :

పింఛను పుస్తకాలు పంచిన ఎమ్మెల్యే అమర్నాథ్

ABOUT THE AUTHOR

...view details