శ్రీనివాస కల్యాణం, శ్రీకృష్ణ జన్మవృత్తాంతం, శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం...ఇలా ఎన్నో పురాణ, ఇతిహాస ఘట్టాలు బొమ్మలు కొలువులో ప్రతిబింబిస్తాయి. పురాణగాథలు చదివే అలవాటు లేని వారికి ఈ బొమ్మల ద్వారా ఎన్నో నీతి కథలు చెబుతారిక్కడ. సాధించాల్సిన విజయాల వైపు సాగేలా స్ఫూర్తి రగిల్చే జీవిత గాథలను అందిస్తుందీ బొమ్మల కొలువు .
ఇలాంటి ఎన్నో పురాణగాథలను తెలియజేస్తోంది... తిరుపతికి చెందిన రేవతి కేశవన్ కుటుంబం ఏర్పాటు చేసిన నవరాత్రి బొమ్మల కొలువు. కన్నయ్య అల్లరి తెలియాలన్నా...కలియుగ వైకుంఠ నాథుడి బ్రహ్మోత్సవాల విశేషాలు తెలుసుకోవాలన్నా ఆ ఇంటికి వెళ్లాల్సిందే. దాదాపు పదేళ్ల నుంచి ఏడాదికి ఓ కథాంశంతో బొమ్మల కొలువు తీర్చిదిద్దుతున్నారీ రేవతి కేశవన్ కుటుంబం. పరమానందయ్య శిష్యుల కథ, శ్రీనివాసుని కల్యాణం, శ్రీ మహావిష్ణువు దశావతరాలు, దుర్గా నవరాత్రుల ప్రత్యేకంగా నవశక్తి రూపాలు, కుంభకర్ణుడి నిద్ర ఇలా ఒకటా రెండా పదుల సంఖ్యలో పురాణ ఇతిహాస ఘట్టాలు ఇక్కడ దర్శనమిస్తాయి. .శ్రీరంగం, కడలూరు, కాంచీపురం, మధురై, చెన్నై, తిరుపతి నుంచి 5 వందల బొమ్మలు సేకరించి ఇక్కడ ఉంచారు.