Body Builder Committed Thefts: అతడో బాడీ బిల్డర్.. బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆంధ్రా అనే టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. అయితే అతడికి ఎక్కువగా కష్టపడకుండా.. సులువుగా డబ్బు సంపాదించాలి అనే అత్యాశ కలిగింది. అందుకోసం బెంగళూరుకు వెళ్లాడు.. అక్కడికి వెళ్లింది.. ఏదో ఉద్యోగం చేసుకోవటానికి అయితే కాదండోయ్..! అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. దొంగతనాలు చేస్తే డబ్బును సులభంగా సంపాదించొచ్చని అనుకున్న అతడు అక్కడకు వెళ్లాడు. ఒంటరిగా వెళ్తున్న వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. ఇలా ఇప్పటి వరకు 32 కేసుల్లో ఇతగాడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నపాటి సెలబ్రిటీగా పేరు మోసిన ఇతడిపై ఇన్ని కేసులు నమోదు కావడంతో.. పోలీసులు అవాక్కైయ్యారు. చివరికి పోలీసుల చేతికి చిక్కడంతో.. దొంగసొత్తు స్వాధీనంపై పోలీసులు దృష్టి పెట్టారు. వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన నిందితుడు సయ్యద్ బాషా 2005 నుంచి 2015 వరకు కువైట్‌లో కారు డ్రైవర్‌గా పనిచేశాడు. ఈ సమయంలో విదేశాల్లో ఉంటూ గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడేవాడనే ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో బాషా తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అదే సమయంలో శారీరక వ్యాయామంపై అతడు ఆసక్తిని పెంచుకున్నాడు. బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆంధ్ర అనే టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే అతడు సులభంగా డబ్బు సంపాదించేందుకు భాషా నేరస్థులతో సంబంధాలను పెంచుకున్నాడు. ఆపై అతడు వరుసగా గొలుసు దొంగతానాలకు పాల్పడ్డాడు.