కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే హత్యా రాజకీయాలు చేస్తున్నారని భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైనా మండిపడ్డారు.
సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన ప్రాంతానికి వెళ్లేందుకు భాజపా నేతలు యత్నించారు. సోము వీర్రాజు సహా భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భాజపా నాయకులు, పోలీసుల మధ్య తోపులాటతో కాసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఉద్రిక్త పరిస్థితుల మధ్యే పోలీసులు సోము వీర్రాజు సహా పలువురిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
సొంత పూచీకత్తుపై విడుదల