BJP Leaders Harsh Comments on MP Vijayasai Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన వ్యాఖ్యలపై.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్‌లు తీవ్రంగా స్పందించారు. పురందేశ్వరిపై ఆరోపణలు చేసే అర్హత విజయసాయి రెడ్డికి లేదని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి బంధువులకు మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. అక్రమాస్తులకు సంబంధించి.. సీబీఐ, ఈడీ కేసుల్లో పదేళ్లుగా బెయిలుపై బయట తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్, విజయసాయి రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానాలు చెబుతారు..? అని నిలదీశారు.
Adinarayana Reddy Comments: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుపురందేశ్వరిపై ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఆరోపణలు చేయడానికి విజయసాయి రెడ్డికి ఏమాత్రం అర్హత గానీ, హక్కు గానీ లేదు. విజయసాయి రెడ్డి బంధువులకు మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న మాట వాస్తవం కాదా..?. మా పార్టీ నేతపై ఇన్ని ఆరోపణలు చేస్తున్న విజయసాయి రెడ్డి.. పార్లమెంటు సాక్షిగా బీజేపీకి మద్దతు ఇచ్చారా..? లేదా..?. వైసీపీ బీజేపీకి మద్దతు ఇస్తోందా..?, లేదా..?. అక్కడేమో మద్దతు ఇచ్చి.. ఇక్కడేమో పురందేశ్వరిపై ఆరోపణలు చేస్తారా..?'' అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎంపీ విజయసాయి రెడ్డి అవినీతి అక్రమాస్తులపై సుప్రీం సీజేఐకి పురందేశ్వరి లేఖ
Lanka Dinakar Comments: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి రాజకీయ విషయ పరిజ్ఞానం శూన్యమని.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. డొల్ల కంపెనీలతో ప్రజాధనం దోచయడంలో ఆయనకు అపార అనుభవం ఉందని ఆక్షేపించారు. విభజనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, పోలవరం నిధుల విషయమై పురందేశ్వరి కాంగ్రెస్‌ను వీడారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ తిరోగమన రాజకీయాలకు వ్యతిరేకంగా అస్సాంలో హేమంత్ విశ్వాస్ శర్మ బీజేపీలో చేరి.. ముఖ్యమంత్రి అయ్యారని, మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రి అయ్యారని దినకర్ గుర్తు చేశారు.