రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేతలు తితిదే తీరుపై నిరసన ప్రదర్శనలు చేశారు. దేవాలయ ఆస్తుల అమ్మకానికి చేస్తున్న ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖ జిల్లాలో...
హిందూ దేవాలయాల ఆస్తులను కాపాడాలని కోరుతూ భాజపా నేతలు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉపవాస దీక్షలు చేపట్టారు. విశాఖ గ్రామీణ జిల్లా భాజపా అధ్యక్షులు డాక్టర్ జి. వి సత్యనారాయణ నిరసన తెలిపారు. కశింకోట మండలంలో పొన్నగంటి అప్పారావు పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేశారు.
కడప జిల్లాలో..
తితిదేకు సంబంధించిన ఆస్తుల విక్రయ, లీజ్ విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని భాజాపా కడప అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు కందుల శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. కడప పార్టీ కార్యాలయంలో భౌతిక దూరం పాటిస్తూ దీక్షలు చేపట్టారు. రాజంపేటలో జనసేన నేతలు నిరసన చేపట్టారు. దేవాలయాల ఆస్తులను కాపాడాలని జనసేన నేత మలిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టం కావాలని కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ బాధ్యుడు రమేష్ నాయుడు , జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ రాజు డిమాండ్ చేశారు. మౌన దీక్ష చేపట్టారు.
ప్రకాశం జిల్లాలో..
కనిగిరిలో భాజాపా, జనసేన నేతలు దీక్షలు చేశారు. తితిదే భూముల విక్రయం రద్దు చేయాలని..ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భూములను విక్రయించడమంటే భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని ఆయన వారు మండిపడ్డారు. దాతలు స్వామివారి కోసం ఇచ్చిన ఆస్తులను, భూములను అమ్మే హక్కు పాలకమండలికి లేదని స్పష్టం చేశారు. ఏడాది జగన్ పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమిలేదనీ..వెంకన్న భూములకు, ఆస్తులకు శఠగోపం పెట్టాడని నాయకులు ధ్వజమొత్తారు.
ఒంగోలులో తితిదే భూముల వేలంపై భాజాపా, జనసేన నేతలు ధర్నా చేశారు. దాతలు ఇచ్చిన ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం... వాటిని విక్రయిస్తామని అనడం దారుణమని భాజాపా నేత శ్రీనివాసులు మండిపడ్డారు. చిన్నగంజాంలో భాజపా, జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆలయాల జోలికి రావద్దని... భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని నాయకులు హెచ్చరించారు.